
దేశవ్యాప్తంగా బాపూజీకి ఘన నివాళులు
జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా దేశరాజధానిలోని రాజ్‌ఘాట్ స్మారక చిహ్నం వద్ద శుక్రవారం పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాపూజీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి, ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని జాతిపితకు అంజలి ఘటించారు.
స్మారకం వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనలో గాంధీజీకి ఎంతో ప్రియమైన "రఘుపతి రాఘవ రాజారామ్" వంటి భక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన ప్రముఖులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమరవీరులకు గౌరవసూచకంగా నివాళులర్పించారు. గాంధీజీ బోధించిన సత్యం, అహింస స్వదేశీ సిద్ధాంతాలు 'వికసిత్ భారత్' లక్ష్యానికి స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొనియాడారు.
ప్రధాని మోదీ నివాళి
"మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్‌ఘాట్ వద్ద అంజలి ఘటించిన ప్రధాని నరేంద్ర మోదీ, బాపూజీ చూపిన అహింసా మార్గం ఆయుధాలు లేకుండానే ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధమని కొనియాడారు. సత్యం, అహింస, స్వచ్ఛత అనేవి కేవలం సిద్ధాంతాలు మాత్రమే కావని, అవి మన నిత్యజీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవడమే జాతిపితకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొంటూ, దేశ స్వాతంత్ర౦ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులందరినీ ఈ 'షహీద్ దివస్' వేళ స్మరించుకున్నారు."
బాపూజీకి కవితా నీరాజనం:
శాంతి మార్గమే నీ ఆయుధమని చాటిన మహనీయుడా,
అహింసతోనే అజేయ శక్తిని చూపిన పుణ్యమూర్తివా!
సత్య శోధనలో జగతికి వెలుగులు పంచిన దీపమా,
నీ అడుగుజాడలే మా 'వికసిత్ భారత్'కు మూలస్తంభాలు!
మహాత్మా.. నీ త్యాగ స్మృతిలో వందనం.. అభివందనం! అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
భారత స్వాతంత్ర సంగ్రామంలో అహింసా మార్గంలో పోరాడి దేశానికి విముక్తి ప్రసాదించిన మహాత్మా గాంధీ, 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన మరణించిన ఈ రోజును దేశవ్యాప్తంగా 'అమరవీరుల దినోత్సవం' (షహీద్ దివస్)గా పాటిస్తారు. బాపూజీ ఆశయాలను గౌరవిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా నివాళి కార్యక్రమాలు నిర్వహించారు.
మహాత్మా గాంధీ ఒక గొప్ప ఆలోచన - రాహుల్ గాంధీ
" మహాత్మా గాంధీ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప ఆలోచన. ఆ ఆలోచనను ఒకప్పుడు ఒక సామ్రాజ్యం, మరొకసారి ద్వేషపూరిత భావజాలం, ఇంకొకసారి అహంకారపూరిత అధికారం తుడిచిపెట్టాలని విఫల ప్రయత్నం చేశాయి. కానీ, జాతిపిత మనకు స్వాతంత్ర౦తో పాటు ఒక మూలమంత్రాన్ని ఇచ్చారు. అది ఏమిటంటే, అధికారం కంటే 'సత్యం' శక్తివంతమైనదని, హింస, భయం కంటే 'అహింస', 'ధైర్యం' గొప్పవని. ఈ ఆలోచన ఎప్పటికీ చెరిగిపోదు, ఎందుకంటే గాంధీ భారత ఆత్మలో అమరుడై ఉన్నారు. బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా వినమ్ర నివాళులు."అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాళులర్పిస్తూ,
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాళులర్పిస్తూ, ఏ ద్వేషం అయితే బాపును మన నుండి దూరం చేసిందో, ఆ ద్వేషాన్ని కేవలం ఆయన చూపిన సత్యం, అహింస, ప్రేమ అనే మార్గాల ద్వారానే ఓడించగలమని ఉద్ఘాటించారు. ఇతరుల బాధను తన బాధగా భావించి, గర్వం లేకుండా సేవ చేసేవాడే నిజమైన వైష్ణవ జనుడని బాపు ఇష్టపడే భజనను స్మరిస్తూ, ప్రస్తుత సమాజంలో నెలకొన్న విద్వేషానికి బాపు సిద్ధాంతాలే సరైన పరిష్కారమని ఖర్గే పిలుపునిచ్చారు.
కాగా ఇటు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు కూడా పలువురు గాంధీజీ కి సోషల్ మీడియా వేదిక ద్వారా నివాళులు అర్పించారు.
గాంధీజీ* *సిద్దాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలి
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా, జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నాను. అహింసా విధానంతో కోట్ల మంది దేశప్రజలను ఒక్కతాటిపై నడిపి స్వాతంత్య్రం సాధించారు. గాంధీజీ బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్దాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలి. స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేద్దాం అంటూ పోస్ట్ చేశారు.
జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. అహింసను ఆయుధంగా, సత్యాన్ని మార్గంగా చేసుకొని భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన మహానీయుడు మహాత్మాగాంధీ గారని కొనియాడారు. వారి జీవితం మనకు ధైర్యం, సహనం, మానవత్వం నేర్పిన అమూల్యమైన పాఠమని, గాంధీ గారి ఆదర్శాలను మన జీవితాల్లో ఆచరించడమే వారికి నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గాంధీ గారి వర్ధంతి సందర్భంగా నిర్వహించే ‘అమరవీరుల సంస్మరణ దినం’ సందర్భంగా దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీరులను స్మరించుకున్నారు.
మానవత్వమే ప్రభుత్వం, సమాజానికి పునాది: ఒడిశా ముఖ్యమంత్రి
మహాత్మా గాంధీ పుణ్యతిథి సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ మాట్లాడుతూ, గాంధీజీ అహింసా సిద్ధాంతం, మానవత్వమే ప్రభుత్వం, సమాజానికి పునాది అని పేర్కొన్నారు. దేశ స్వేచ్ఛ భద్రత కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన అమరవీరుల ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ మనకు మార్గదర్శకంగా ఉంటాయి. శాంతియుత, అభివృద్ధి చెందిన ఒడిశాను నిర్మించడానికి మేము కృషి చేస్తూనే ఉంటామని అన్నారు.
ఒడిశా అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి, స్పీకర్ సురమా పాఢీ, ఉప ముఖ్యమంత్రి కె.వి. సింగ్ దేవ్, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు గాంధీజీకి నివాళులర్పించారు.
ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ "జాతిపిత గాంధీజీ ఆశయాలైన అహింస, సత్యం, శాంతి మానవాళికి మార్గదర్శకాలు. ఆయన వారసత్వం సమయం మరియు భౌగోళిక సరిహద్దులకు అతీతమైనది," అని కొనియాడారు.
ఓపీసిసి అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, "గాంధీజీ ఆశయాలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పట్ల మా నిబద్ధతను ప్రేరేపిస్తాయి." ఈ సందర్భంగా భద్రక్ నుండి కాంగ్రెస్ పార్టీ 'గాంధీ పథే ఒడిశా పాదయాత్ర'ను పునఃప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
