
దేశవ్యాప్తంగా పిల్లల అదృశ్యం వెనుక ఏదైనా నెట్‌వర్క్ ఉందా?: సుప్రీం
దేశంలో ప్రతి ఎనిమది నిమిషాలకో పిల్లాడు అదృశ్యమవుతున్న సంఘటనలపై సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పిల్లలు అదృశ్యమవుతున్న ఘటనల వెనుక దేశవ్యాప్తంగా ఏదైనా నెట్‌వర్క్ ఉందా? లేక రాష్ట్రాలకే పరిమితమైన ముఠాల పనితనమా? అన్న అంశాన్ని స్పష్టంగా నిర్ధారించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనలు యాదృచ్ఛికమా? లేక ఏదైనా నిర్దిష్ట పద్ధతి (ప్యాటర్న్) ఉందా? అన్నదానిపై సమగ్రంగా విశ్లేషించాలని కోర్టు సూచించింది. జస్టిస్ బీవీ నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ అంశంపై విచారణ జరిపింది. అన్ని రాష్ట్రాల నుంచి పిల్లల అదృశ్యంపై పూర్తి వివరాలు సేకరించాలని, అప్పుడే నిజమైన వివరాలు బయటకు వస్తాయని కోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటీ వాదనలు వినిపిస్తూ, కొన్ని రాష్ట్రాలు మాత్రమే తమ వద్ద ఉన్న అదృశ్యమైన పిల్లలు, కేసుల ప్రాసిక్యూషన్‌కు సంబంధించిన డేటాను ఇచ్చాయని తెలిపారు. అయితే దాదాపు డజను రాష్ట్రాలు ఇంకా వివరాలు సమర్పించలేదని కోర్టుకు తెలిపారు. పూర్తి డేటా వచ్చిన తర్వాతే సరైన విశ్లేషణ సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, పిల్లలు మాయమవుతున్న ఘటనల వెనుక దేశవ్యాప్తంగా పనిచేసే ముఠా ఉందా? లేక రాష్ట్రాలవారీగా పనిచేసే గుంపులా? ఇది ఒక పద్ధతిగా జరుగుతోందా? లేక యాదృచ్ఛిక ఘటనలేనా? అని కేంద్రాన్ని ప్రశ్నించింది.
అదే సమయంలో, రక్షించిన పిల్లలను విచారించి, ఈ ఘటనల వెనుక ఎవరు ఉన్నారో గుర్తించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సూచించింది. పిల్లల అదృశ్యంపై డేటా ఇవ్వని రాష్ట్రాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అవసరమైతే కఠిన ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది అపర్ణ భట్ వాదనలు వినిపిస్తూ, ఈ విషయంలో కేంద్రం ముందడుగు వేసిందని, అయితే అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా డేటా ఇవ్వాలనేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. పిల్లల అదృశ్య ఘటనలు పెరుగుతున్నాయని పేర్కొంటూ ‘గురియా స్వయం సేవి సంస్థాన్’ అనే ఎన్‌జీఓ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ పిటిషన్‌లో, పలు రాష్ట్రాల్లో వేలాది మంది పిల్లల ఆచూకీ ఇంకా లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇదివరకు, డిసెంబర్ 9న సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గత ఆరు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అదృశ్యమైన పిల్లల డేటాను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలాగే, రాష్ట్రాలు–కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం కోసం హోం మంత్రిత్వ శాఖలో ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించింది. అంతకుముందు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పిల్లల అదృశ్య కేసుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక నోడల్ అధికారులను నియమించాలని, మహిళా–శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించే పోర్టల్‌లో ఈ వివరాలను వెంటనే అప్‌లోడ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక పిల్లాడు అదృశ్యం
గతేడాది నవంబర్ 18న, దేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక పిల్లాడు అదృశ్యమవుతున్నాడన్న వార్తా కథనంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అత్యంత తీవ్రమైన సమస్య అని పేర్కొన్న ధర్మాసనం, దేశంలోని దత్తత ప్రక్రియ అత్యంత క్లిష్టంగా ఉందని, దాన్ని సరళీకరించాలని కేంద్రాన్ని కోరింది. దత్తత విధానం కఠినంగా ఉండటంతోనే అక్రమ మార్గాలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించిన కోర్టు, పిల్లల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించింది. పోలీసు శాఖల మధ్య సమన్వయం లోపించడమే పిల్లల అదృశ్య కేసులు పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణమని కోర్టు గతంలోనే వ్యాఖ్యానించింది. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక అధికారి ఉండేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, సమాచారాన్ని వేగంగా పంచుకునే విధానం అవసరమని స్పష్టం చేసింది. ఎన్‌జీఓ తన పిటిషన్‌లో ఉత్తరప్రదేశ్‌లో గతేడాది నమోదైన ఐదు కేసులను ఉదాహరణగా చూపింది. ఆ కేసుల్లో చిన్నారులను అపహరించి, మధ్యవర్తుల ద్వారా జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు తరలించినట్లు పేర్కొంది.
దేశంలో పిల్లలు అదృశ్యమవుతున్న ఘటనలు — రాష్ట్రాల గణాంకాలు
ఎన్సీఆర్బీ 2023 డేటా ప్రకారం, దేశవ్యాప్తంగా పెరిగిన అదృశ్యం కేసులు
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ ) 2023 సంవత్సరంలో పిల్లలు అదృశ్యమవుతున్న తీరు గురించి రిపోర్ట్ విడుదల చేసింది. మొత్తంగా ఈ ఏడాదిలో 91,296 పిల్లలు అదృశ్యమైనట్లు డేటా సూచిస్తోంది . ఈ సంఖ్య 2022తో పోల్చితే సుమారు 9.5 శాతం పెరిగింది. ఇందులో 68,835 మంది అమ్మాయిలే ఉన్నట్లు వెల్లడైంది.
రాష్ట్రాల గణాంకాలు
పశ్చిమ బెంగాల్–ఈ రాష్ట్రంలో మిస్సింగ్ కేసుల సంఖ్య అత్యధికంగా ఉంది. మొత్తం 21,661 కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ 2023 డేటా సూచిస్తుంది, ఇందులో అత్యధిక సంఖ్యలో బాలికలు ఉన్నారు.
ఢిల్లీ– ఎన్సీఆర్బీ ప్రకారం 2023లో 6,284 పిల్లలు అదృశ్యమయ్యారు. వీరిలో చాలామందిని అధికారులు గుర్తించి తిరిగి కనుగొన్నప్పటికీ, కొన్ని కేసులు ఇంకా పరిష్కారం పొందాల్సి ఉంది.
మహారాష్ట్ర– ఈ రాష్ట్రంలో కూడా పిల్లలపై నేరాల సంఖ్య పెరిగినట్లు డేటా తెలిపింది, మొత్తం 22,390 దేశవ్యాప్తంగా క్రైమ్స్ ఎగనెస్ట్ చిల్డ్రన్ కేసులలో మహారాష్ట్ర ప్రధానంగా ఉంది.
ఒడిశా– నేరాల శ్రేణిలో పిల్లలపై అత్యధికంగా కిడ్నాపింగ్ కేసులు నమోదు అయ్యాయని రిపోర్ట్ పేర్కొంది. 2023లో రాష్ట్రంలో 5,978 కేసులు నమోదయ్యాయి.
అసలు కారణం
పిల్లలు అదృశ్యమవడం పూర్తి స్థాయిలో కిడ్నాపింగ్, ట్రాఫికింగ్, ఫ్యామిలీ రన్ కేసులు, లేక వ్యక్తిగత పరిస్థితులు వంటి అనేక కారణాల వల్ల జరుగుతుందని అనేక పరిశీలనల్లో గుర్తించారు. డేటా ప్రకారం కిడ్నాప్ కేసులు అత్యధిక భాగంగా ఉన్నట్లు చెబుతోంది.
