Let's talk: editor@tmv.in
దేశవ్యాప్తంగా చొరబాటుదారులందరినీ పంపిస్తాం: అమిత్ షా

దేశవ్యాప్తంగా చొరబాటుదారులందరినీ పంపిస్తాం: అమిత్ షా

Pinjari Chand
30 డిసెంబర్, 2025

దేశవ్యాప్తంగా ఉన్న చొరబాటుదారులందరినీ (ఇన్‌ఫిల్ట్రేటర్లను) పంపించడమే బీజేపీ లక్ష్యం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సోమవారం అస్సాంలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన బటద్రవ థాన్ పునర్వికాస ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాం వైష్ణవ సంప్రదాయానికి మూలపురుషుడైన మహాపురుష్ శ్రీమంత శంకరదేవ్ జన్మస్థలంలో అక్రమ ఆక్రమణలు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులు ఉండటం సరైనదేనా? అని అమిత్ షా ప్రశ్నించారు. ఈ పవిత్ర స్థలాన్ని అక్రమ ఆక్రమణల నుంచి విముక్తం చేసి నామఘర్‌ను తిరిగి ప్రతిష్ఠించడంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన కృషిని ఆయన అభినందించారు.

కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

చొరబాటుదారులను కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందని అమిత్ షా ఆరోపించారు. అస్సాం ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. కానీ కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు పాలించినప్పటికీ వారి త్యాగాలకు న్యాయం చేయలేదని విమర్శించారు. ఇప్పటివరకు లక్ష బీగాల(ఎకరాలు)కు పైగా భూమి అక్రమ ఆక్రమణల నుంచి విముక్తమైందని తెలిపారు. గత పది సంవత్సరాల్లో 1.45 లక్షల బీగాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయించిందని సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. సత్రాలు (వైష్ణవ మఠాలు) ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

గోపీనాథ్ బోర్డోలాయ్ పాత్ర

అస్సాం తొలి ముఖ్యమంత్రి భారతరత్న గోపీనాథ్ బోర్డోలాయ్ పాత్రను అమిత్ షా గుర్తు చేశారు. ఆయన లేకపోతే అస్సాం, ఈశాన్య భారతం దేశంలో భాగంగా ఉండేది కాదు. జవహర్‌లాల్ నెహ్రూను ఒప్పించి అస్సాంను భారత్‌లో భాగంగా నిలిపారని గుర్తు చేశారు.

బటద్రవ థాన్ – ఐక్యతకు ప్రతీక

బటద్రవ థాన్ అస్సామీ ఐక్యత, సామరస్యానికి ప్రతీక అని అమిత్ షా అన్నారు. శంకరదేవుడు ప్రచారం చేసిన ‘నవ-వైష్ణవ ధర్మం’ అన్నీ వర్గాల ప్రజలను కలిపే సమానత్వ భావనను ప్రతిబింబిస్తుందని తెలిపారు.

ప్రాజెక్ట్ వివరాలు

162 బీగాల అక్రమ ఆక్రమణల నుంచి విముక్తమైన భూమిపై అభివృద్ధి

వ్యయం: సుమారు రూ.217 కోట్లు

లక్ష్యం: ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక–సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం

శంకరదేవుడి భక్తి, సమానత్వం, సామాజిక సామరస్య భావనలను ప్రపంచానికి చాటడం

దేశవ్యాప్తంగా చొరబాటుదారులందరినీ పంపిస్తాం: అమిత్ షా - Tholi Paluku