Let's talk: editor@tmv.in
దేశవ్యాప్తంగా ఘనంగా సీఐఎస్ఎఫ్ 57వ స్థాపన దినోత్సవ వేడుకలు

దేశవ్యాప్తంగా ఘనంగా సీఐఎస్ఎఫ్ 57వ స్థాపన దినోత్సవ వేడుకలు

Dantu Vijaya Lakshmi Prasanna
11 మార్చి, 2026

భారత్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ స్థాపన దినోత్సవం (సీఐఎస్ఎఫ్)57వ స్థాపన దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితర ప్రముఖులు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న సుమారు 1.7 లక్షల మంది సిబ్బందితో కూడిన ఈ దళం అందిస్తున్న సేవలను వారు కొనియాడారు.

దేశంలోని విమానాశ్రయాలు, అణు విద్యుత్ కేంద్రాలు, వ్యూహాత్మక పారిశ్రామిక సంస్థలు, అలాగే ఇస్రో స్థావరాలు వంటి కీలక మౌలిక వసతులను రక్షించడంలో సీఐఎస్ఎఫ్ ప్రధాన భద్రతా దళంగా పనిచేస్తోంది. దేశ అభివృద్ధికి కీలకమైన ఈ సంస్థలు భద్రంగా ఉండేలా సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా సేవలందిస్తున్నారని నేతలు పేర్కొన్నారు.

1969లో స్థాపించబడిన సీఐఎస్ఎఫ్ ప్రారంభంలో కేవలం 2,800 మంది సిబ్బందితో పనిచేయడం ప్రారంభించింది. కాలక్రమేణా దళం విస్తరించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 370కు పైగా కీలక ప్రదేశాలకు భద్రత కల్పించే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా విమానాశ్రయ భద్రతలో ఈ దళం కీలక పాత్ర పోషిస్తూ ప్రతి సంవత్సరం సుమారు 1.2 బిలియన్ ప్రయాణికులకు భద్రతా తనిఖీలు నిర్వహిస్తోంది.

సీఐఎస్ఎఫ్ యొక్క నినాదం “రక్షణ మరియు భద్రత”. ఈ నినాదానికి అనుగుణంగా దేశంలోని పారిశ్రామిక, వ్యూహాత్మక, మౌలిక వసతులను రక్షించడమే కాకుండా ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చర్యలు, విపత్తు నిర్వహణ కార్యకలాపాల్లో కూడా ఈ దళం చురుకుగా పాల్గొంటోంది. దీనివల్ల దేశ భద్రతా వ్యవస్థలో సీఐఎస్ఎఫ్‌కు ప్రత్యేక స్థానం ఏర్పడింది.

ఈ ఏడాది ప్రధాన స్థాపన దినోత్సవ పరేడ్‌ను మార్చి 6న ఒడిశాలో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎయిర్‌క్రాఫ్ట్ హైజాక్ నిరోధక ప్రదర్శనలు నిర్వహించి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఆ పరెడ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డ్రోన్ భద్రతా వ్యవస్థకు సీఐఎస్ఎఫ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా దేశంలోని ముఖ్యమైన పోర్టులు, తీర ప్రాంత భద్రతలో కూడా సీఐఎస్ఎఫ్ సేవలను వినియోగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

సీఐఎస్ఎఫ్ 57వ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. అందులో సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ, దేశ భద్రత పురోగతిలో వారి సేవలు ఎంతో విలువైనవని చెప్పారు. దేశవ్యాప్తంగా కీలక మౌలిక వసతుల భద్రతను కాపాడటంలో సీఐఎస్ఎఫ్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

అలాగే, సీఐఎస్ఎఫ్ సిబ్బంది తమ దృఢ సంకల్పం, క్రమశిక్షణ, అంకితభావంతో దేశానికి సేవలందిస్తున్నారని తెలిపారు. దేశ అభివృద్ధికి కీలకమైన విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలు, మెట్రో రైలు నెట్‌వర్క్‌లు, ప్రభుత్వ సంస్థలు వంటి అత్యంత ముఖ్యమైన మౌలిక వసతులను కాపాడటంలో ఈ దళం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.

ప్రధాని తన సందేశంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తమ కర్తవ్యానికి అంకితభావంతో పనిచేస్తూ దేశ భద్రతను మరింత బలపరుస్తున్నారని, వారి నిరంతర సేవలు భారత్‌ అభివృద్ధి ప్రయాణానికి కూడా ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. దేశ రక్షణలో సీఐఎస్ఎఫ్ వంటి భద్రతా దళాల పాత్ర అపారమని ఆయన మరోసారి నొక్కి చెప్పారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఐఎస్ఎఫ్ స్థాపన దినోత్సవం సందర్భంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు, దేశంలోని కీలక స్థావరాలను రక్షించడంలోనూ, సంక్షోభ సమయాల్లో దేశాన్ని కాపాడడంలోనూ వారు చూపుతున్న అంకితభావం నిజమైన దేశభక్తి, వృత్తిపరమైన నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తోంది. దేశం కోసం పరమ త్యాగం చేసిన అమర వీరులకు వినమ్ర నివాళులు అంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, వందనాలు. ఐదు దశాబ్దాలకు పైగా కాలంగా సీఐఎస్ఎఫ్ దేశంలోని కీలక స్థావరాలు, వ్యూహాత్మక ఆస్తులను కాపాడుతూ దేశానికి అచంచల రక్షకుడిగా నిలుస్తోంది. అసాధారణ ధైర్యం, వృత్తిపరమైన నైపుణ్యం, అంకితభావంతో ఈ దళం తన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తోంది. సంక్షోభాలు, ప్రకృతి విపత్తుల సమయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది వేగంగా స్పందించి అనేక మంది ప్రాణాలను రక్షించడం గొప్ప సేవగా నిలిచింది. దేశం వారి అచంచల సేవా భావం, నిబద్ధతను గాఢంగా అభినందిస్తోంది అంటూ తన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.