Let's talk: editor@tmv.in
దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి

దేశవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి

Pinjari Chand
6 నవంబర్, 2025

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం కార్తీక పౌర్ణమి, దేవ దీపావళి పర్వదినాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘కార్తీక పౌర్ణమి, దేవ దీపావళి పర్వదినాల సందర్భంగా దేశంలోని కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు సంకేతమైన ఈ పవిత్ర సందర్భం అందరికీ ఆనందం, ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యం కలిగించాలి. పవిత్ర స్నానాలు, దానం, హారతి, పూజలతో కూడిన మన సంప్రదాయాలు ప్రతి ఒక్కరి జీవితాన్ని వెలిగించాలని మోడీ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ హర్‌కి పౌరీ వద్ద బుధవారం తెల్లవారుజామున వేలాది మంది భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానాలు చేశారు. పాప విమోచనం, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయని విశ్వాసంతో భక్తులు గంగా స్నానాలు చేస్తారు. బీహార్‌లో పట్నా దిఘా–ఏయిమ్స్ రహదారిపై భారీగా భక్తులు గంగా ఘాట్ వైపు భారీగా తరలిరావడంతో ఉదయం ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇక ఒడిశాలోని పూరీ నగరంలో చారిత్రాత్మక నరేంద్ర పోఖరిలో ‘బోయిత బందన’ (బోటు పండుగ)ను ఘనంగా జరుపుకున్నారు. అరటితొక్కలు, కాగితం, థర్మకోల్‌తో తయారు చేసిన చిన్న బోట్లను నీటిలో వదిలే ఈ పండుగ ఒడిశా పురాతన సముద్ర వాణిజ్య చరిత్రకు ప్రతీకగా భావిస్తారు. జావా, సుమిత్రా, బాలి వంటి ఆగ్నేయాసియా దేశాలతో ఒడిశాకు ఉన్న వాణిజ్య సంబంధాలను ఈ పండుగ గుర్తు చేస్తుంది. దేవ్ దీపావళిని వారణాసిలో ప్రత్యేకంగా నిర్వహించుకున్నారు. గంగా నదీ ఒడ్డున ఉన్న ఘాట్లలో లక్షలాది దీపాలు వెలిగించారు. భక్తులు గంగా స్నానాలు చేశారు. హరిద్వార్ లోనూ కార్తీక పూర్ణమిని, దేవ్ దీపావళిని వైభవంగా జరుపుకున్నారు. ఘాట్ల వద్ద భక్తులు ఉదయాన్నే పవిత్ర స్నానాలు ఆచరించారు. గర్హ్‌ముఖ్టేశ్వర్, ప్రయాగ్ రాజ్ లోనూ ప్రజలు వేడుకలు నిర్వహించుకున్నారు.

కార్తీక పౌర్ణమి హిందూ పంచాంగంలోని పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజు శివ–పార్వతీ కుమారుడు కార్తికేయుడి జన్మదినం కూడా. దేశవ్యాప్తంగా భక్తులు దీపాలు వెలిగించి, ఆలయాలను అలంకరించి, ఆధ్యాత్మిక ఉత్సాహంతో పండుగ జరుపుకుంటున్నారు. రాత్రివేళ భక్తులు దీపాలతో అలంకరించిన చిన్న బోట్లను నీటిలో వదిలి మంత్రోచ్ఛారణలతో ప్రార్థనలు చేయడం ఒక అద్భుత దృశ్యాన్ని సృష్టించింది.