
దేశమంతా ‘లోభపు మహమ్మారి’ విస్తరించింది: రాహుల్ గాంధీ
దేశవ్యాప్తంగా లోభపు మహమ్మారి(స్వలాభమే ముఖ్యం–సమాజాన్ని చంపేస్తున్న వ్యాధి) విస్తరించిందని, దాని భయంకర రూపమే పట్టణాల్లో కనిపిస్తున్న ఈ దుస్థితి అని కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలోని ముబారక్‌పూర్ దాబాస్ పరిధిలోని శర్మ ఎన్‌క్లేవ్ ప్రాంతం మురుగు నీటితో పూర్తిగా మునిగిపోయిన వీడియోను సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పంచుకుంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాధారణ ప్రజల జీవితం నరకయాతనగా మారిందని పేర్కొన్న రాహుల్ గాంధీ.. పాలనా వ్యవస్థ పూర్తిగా అధికారంలో ఉన్నవారి చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. పరస్పరం వెన్నుతట్టుకుంటూ పాలకులు ప్రజలను అణిచివేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు ప్రతి సాధారణ భారతీయుడి జీవితం ఇలాగే నరకంగా మారింది. వ్యవస్థ అధికారంలో ఉన్నవారికి అమ్ముడుపోయింది. అందరూ ఒకరినొకరు వెన్నుతట్టి, కలిసికట్టుగా ప్రజలను తొక్కేస్తున్నారు. దేశమంతా లోభపు మహమ్మారి విస్తరించింది. దాని అత్యంత భయానక ముఖమే పట్టణాల్లోని ఈ కుళ్లు. ఈ పరిస్థితిని ‘న్యూ నార్మల్’గా అంగీకరించడంతో మన సమాజం నిశ్శబ్దంగా, ఉదాసీనంగా మరణిస్తోంది. జవాబుదారీతనం డిమాండ్ చేయండి… లేకపోతే ఈ కుళ్లు ప్రతి ఇంటి తలుపు తడుతుందని బుధవారం రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
శర్మ ఎన్‌క్లేవ్‌లో తీవ్ర పరిస్థితి
రాహుల్ గాంధీ పంచుకున్న వీడియోలో స్థానిక జర్నలిస్టు శర్మ ఎన్‌క్లేవ్ ప్రాంతంలోని పరిస్థితిని చూపించారు. మురుగు నీరు ఉప్పొంగి వీధులన్నీ నీటితో నిండిపోయినట్లు వీడియోలో కనిపించింది. గత 6 నుంచి 8 నెలలుగా పరిస్థితి మరింత దిగజారిందని స్థానికులు తెలిపారు. నీటిలో నడవలేని పరిస్థితి ఏర్పడిందని, రోజువారీ జీవితం పూర్తిగా అస్తవ్యస్తమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, డ్రైనేజ్, పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
డీపీసీసీ అధ్యక్షుడి పర్యటన
ఇదిలా ఉండగా ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ కిరారి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సందర్శించారు. అక్కడ నీటమునిగి తీవ్ర సమస్యలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.
