
దేశమంతటా ఘనంగా పోలీస్ స్మారక దినోత్సవ వేడుకలు
అక్టోబర్ 21న పోలీస్ స్మారక దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ముందుగా పోలీసు సిబ్బంది అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు సమాజంలో "మొదటి ప్రతిస్పందనదారులు"అని కొనియాడారు. వీరు అసాధారణ ధైర్యంతో, నిబద్ధతతో నేరాలు, అంతర్గత భద్రతకు వాటిల్లే ముప్పులను తిప్పికొట్టడం తో పాటు పౌరుల హక్కులను పరిరక్షించడం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేస్తారు అన్నారు. దేశ సేవలో తమ ప్రాణాలను అర్పించిన "అమరవీరులకు ఘన నివాళులు" అర్పించారు.
అదనపు నివాళి
అలాగే, ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, హోం మంత్రి *నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు*, *ఇండియన్ నేషనల్ ఆర్మీ * లో ధైర్యవంతులైన యోధులకు కూడా నివాళులు అర్పించారు. స్వంత సైన్యం ద్వారా స్వాతంత్య్రం సాధించవచ్చనే విశ్వాసాన్ని ప్రజల్లో నింపడంలో సుభాస్ చంద్రబోస్ కీలక పాత్రను పోషించారు అన్నారు.
ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రసంగం ఈ దినోత్సవం ప్రాముఖ్యత గురించి వివరంగా తెలియజేస్తుంది. ఈ సందర్బంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ సైన్యం, పోలీసు శాఖలు రెండూ దేశ భద్రతకు స్తంభాలు వంటివని నొక్కి చెప్పారు. సరిహద్దు దాటి వచ్చే శత్రువైనా లేదా దేశంలో దాగి ఉన్న శత్రువైనా, భారతదేశ భద్రత కోసం నిలబడే వ్యక్తి కి ఒకే విధంగా కనిపిస్తారు అన్నారు. ఈ రెండు శాఖలు ఎల్లప్పుడూ ప్రజల్లో స్ఫూర్తిని కలిగజేస్తాయని పేర్కొన్నారు.
మిషన్ ఒక్కటే: సైన్యం, పోలీసులకు పనిచేసే వేదికలు వేరైనా, వారి మిషన్ మాత్రం జాతీయ భద్రతే అని రాజనాథ్ స్పష్టం చేశారు. దేశ అంతర్గత, బాహ్య భద్రత చూసే సంస్థలు నిరంతరం సమన్వయం కలిగి ఉండాలన్నారు. దేశం 2047 నాటికి 'వికసిత్ భారత్' సాధించే (అభివృద్ధి చెందిన భారతదేశం) లక్ష్యం వైపు చూస్తున్నందున, అంతర్గత, బాహ్య భద్రత మధ్య సమతుల్యత మునుపెన్నడూ లేనంత ముఖ్యమని ఉద్ఘాటించారు. దేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లను అధికమించడానికి వనరులు పరిమితంగా ఉన్నందున, భద్రతా సంస్థల మధ్య సమన్వయం, ఏకీకరణ ద్వారా వాటిని సరైన రీతిలో పరిష్కరించాలని సూచించారు.
పోలీసుల పాత్రపై ప్రశంసలు:
పోలీసులకు నేరం, చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. నేటి సమాజంలో పోలీసులు కేవలం నేరాన్ని మాత్రమే కాకుండా, ప్రజలకు చట్టాలపై ఉన్న అవగాహన ను కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రశంసించారు. మన పోలీసులు తమ అధికారిక విధులతో పాటు నైతిక కర్తవ్యాన్ని కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారని కొనియాడారు. భారతదేశ పౌరులకు తమపై ఏదైనా అన్యాయం జరిగితే పోలీసులు తమకు అండగా ఉంటారనే విశ్వాసం ఉందని మంత్రి రాజనాథ్ అన్నారు.దేశంలో నక్సలిజాన్ని బిజేపి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అణిచివేస్తుందని, దానికి పోలీసుల సహకారం ఎంతో వుందని ఈ సందర్బంగా ప్రస్తావించారు.
స్మారక చిహ్నం స్థాపన
చాలా కాలంగా సమాజం మనం పోలీసుల సేవలను పూర్తిగా గుర్తించలేదని, వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి సరైన ప్రయత్నాలు చేయలేదని రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు.అయితే, ప్రధాని మోదీ నాయకత్వంలో 2018లో జాతీయ పోలీస్ స్మారక చిహ్నం స్థాపించబడిందని, పోలీసులకు ఆధునిక ఆయుధాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా దేశ సేవలో అమరులైన పోలీసు వీరులకు ఆయన నివాళులర్పించారు.
జాతీయ పోలీస్ స్మారక చిహ్నం
ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 న దేశవ్యాప్తంగా పోలీసు వీరులకు నివాళులర్పించేందుకు ఈ దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ ప్రధాన కార్యక్రమం న్యూ ఢిల్లీలోని జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద జరుగుతుంది. 1959, అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద భారీగా ఆయుధాలు ధరించిన చైనా సైనికులు వేసిన మాటులో పది మంది ధైర్యవంతులైన పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారు. వారి త్యాగానికి గుర్తుగా ఈ రోజును స్మారక దినోత్సవంగా పాటిస్తారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు సిబ్బంది అందరి త్యాగాలను స్మరించుకోవడానికి ఈ రోజును అంకితం చేశారు.
స్వాతంత్రo వచ్చినప్పటి నుండి దేశ భద్రత, సమగ్రతను కాపాడటంలో పోలీసుల పాత్రను గుర్తించి, ప్రధాని మోదీ 2018లో ఈ స్మారక చిహ్నాన్ని దేశానికి అంకితం చేశారు.ఇది పోలీసు బలగాలకు జాతీయ గుర్తింపు, గర్వం, ఉమ్మడి చరిత్ర, ఉద్దేశ్య ఐక్యతను తెలుపుతుంది. ఈ స్మారక చిహ్నంలో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి:
కేంద్ర శిల్పం : 30 అడుగుల ఎత్తైన నల్ల గ్రానైట్ ఏకశిలా స్మారక స్థూపం. ఇది పోలీసు సిబ్బంది బలం, స్థితిస్థాపకత, నిస్వార్థ సేవకు చిహ్నం.
వాలర్ గోడ: అమరులైన పోలీసుల పేర్లు దీనిపై చెక్కబడి ఉంటాయి.
మ్యూజియం: భారతదేశంలో పోలీసు వ్యవస్థ చరిత్ర , పరిణామాన్ని తెలియజేస్తుంది. అక్టోబర్ 22 నుండి 30 వరకు జాతీయ పోలీస్ స్మారక చిహ్నం వద్ద అమరుల కుటుంబ సభ్యుల సందర్శన, పోలీసు బ్యాండ్ ప్రదర్శన, రక్తదాన శిబిరాలు వంటి వివిధ స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
దేశ భద్రతా దళాల అంకితభావం, ధైర్యం, అత్యున్నత త్యాగాలను ఉన్నత ప్రభుత్వ అధికారులను గుర్తించి, గౌరవించే ఒక ప్రముఖ మైన రోజుగా ఈ స్మారక దినోత్సవాన్ని దేశం యావత్తు జరుపుకుంటుంది. తెలంగాణ తో సహా అన్ని రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో అనేక ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అందరూ అమరులైన పోలీస్ లకు నివాళులు అర్పించారు..
