Let's talk: editor@tmv.in
దేశమంతటా కమర్షియల్ ఎల్పీజీ విక్రయాలు ప్రారంభం

దేశమంతటా కమర్షియల్ ఎల్పీజీ విక్రయాలు ప్రారంభం

Pinjari Chand
15 మార్చి, 2026

దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ ప్రారంభమైందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎల్పీజీ నిల్వలు దాచిపెట్టడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా దాడులు, ఆకస్మిక తనిఖీలు పెంచినట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ గృహ వినియోగదారులకు అవసరమైన వంటగ్యాస్ సరఫరా చేయడానికి తగినంత నిల్వలు ఉన్నాయని చెప్పారు. అయితే వినియోగదారులు భయంతో ముందుగానే బుకింగ్‌లు చేయడం వల్ల బుకింగ్‌ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని తెలిపారు.

పెరిగిన బుకింగ్‌లు

ఇటీవల రోజుల్లో గ్యాస్ సిలిండర్ బుకింగ్‌లు భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందు రోజుకు సుమారు 55 లక్షల బుకింగ్‌లు ఉండేవి. ప్రస్తుతం బుకింగ్‌లు 88 లక్షలకు పెరిగాయి. కానీ రోజుకు సుమారు 50 లక్షల సిలిండర్లు మాత్రమే డెలివరీ అవుతున్నాయని అధికారులు చెప్పారు. వినియోగదారులు అవసరం ఉన్నప్పుడే బుకింగ్ చేయాలని వారు సూచించారు.

పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు

దేశంలో క్రూడ్ ఆయిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయని అధికారులు తెలిపారు. దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, అందువల్ల పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. భారతదేశం తన క్రూడ్ ఆయిల్ అవసరాల్లో సుమారు 88 శాతం దిగుమతి చేసుకుంటుంది. అలాగే సహజ వాయువులో 50 శాతం, ఎల్పీజీలో 60 శాతం విదేశాలపై ఆధారపడుతోంది.

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యూఎస్‌ఏ–ఇజ్రాయెల్‌ దాడులు చేయడం, తరువాత ఇరాన్ ప్రతిదాడులు చేయడంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఇంధన సరఫరాకు ప్రధాన మార్గమైన హర్ముజ్‌ సముద్ర మార్గం ప్రభావితమైంది. దీంతో పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ సరఫరా తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గృహ వినియోగదారులకు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు తెలిపారు.

దేశీయ ఉత్పత్తి పెంపు

ఎల్పీజీ కొరతను తగ్గించేందుకు దేశీయ ఉత్పత్తిని పెంచుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొదట 10శాతం, తరువాత 25, ఇప్పుడు 31శాతం వరకు ఉత్పత్తి పెంచినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం

గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ నగర గ్యాస్ పంపిణీ సంస్థలతో సమావేశమై కమర్షియల్ వినియోగదారులకు పైప్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) కనెక్షన్లు ఇవ్వాలని సూచించింది. ఎల్పీజీ బదులు పీఎన్‌జీకి మారాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అలాగే ఢిల్లీతో పాటు జాతీయ రాజధాని ప్రాంతంలో పరిశ్రమలు, హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా బయోమాస్, ఆర్డీఎఫ్ పెళ్లెట్లు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించేందుకు కమిషన్‌ ఫర్ ఎయిర్‌‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ ఒక నెలపాటు అనుమతి ఇచ్చింది.

బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు

ఎల్పీజీ నిల్వలు దాచిపెట్టడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌లో సంయుక్త తనిఖీలు

ఉత్తరప్రదేశ్‌లో సుమారు 1,400 ప్రాంతాల్లో తనిఖీలు, 20 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు, 19 మందిపై కేసులు అలాగే ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా దాడులు నిర్వహించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీస్‌) ఒకే రోజులో దేశవ్యాప్తంగా సుమారు 1,300 ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి.

డిజిటల్ బుకింగ్‌కు ప్రోత్సాహం

సిలిండర్ బుకింగ్ కోసం ఎల్పీజీ ఏజెన్సీల వద్ద క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. వినియోగదారులు ఎస్ఎంఎస్, వాట్సాప్, మొబైల్ యాప్‌ల ద్వారా డిజిటల్ బుకింగ్ చేయాలని సూచించారు. ప్రస్తుతం పరిస్థితి తీవ్రంగానే ఉన్నప్పటికీ గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదని, అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని ప్రజలను ప్రభుత్వం కోరింది.

దేశమంతటా కమర్షియల్ ఎల్పీజీ విక్రయాలు ప్రారంభం - Tholi Paluku