
దేశం విడిచి వెళ్లను: అనిల్ అంబానీ
తనకు సంబంధించిన కంపెనీల్లో తాను కేవలం నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మాత్రమే ఉన్నానని, రోజువారీ నిర్వహణ లేదా ఆపరేషనల్ వ్యవహారాల్లో ఎలాంటి పాత్ర పోషించలేదని అనిల్ అంబానీ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ ప్రకటనను ‘ఈఏఎస్ సర్మా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఇతరులు’ కేసులో దాఖలు చేసిన అండర్‌టేకింగ్/కంప్లయెన్స్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ ప్రజాహిత వ్యాజ్యంలో అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు సంబంధించిన రూ.1.5 లక్షల కోట్ల బ్యాంకు మోసం ఆరోపణలు ఉన్నాయి. అఫిడవిట్‌లో, కేసుకు సంబంధించిన విషయాలపై పూర్తిగా అవగాహన ఉన్నదని, ఈ అఫిడవిట్ సమర్పించడానికి తాను సమర్థుడినని అంబానీ పేర్కొన్నారు. న్యాయపరమైన రికార్డులో స్పష్టత, పారదర్శకత ఉండేలా కోర్టుకు పూర్తి సమాచారాన్ని అందించేందుకే ఈ అఫిడవిట్ దాఖలు చేస్తున్నానని తెలిపారు.
ఫిబ్రవరి 4, 2026న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావిస్తూ, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లనని ఇప్పటికే ఇచ్చిన హామీని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ హామీని అధికారికంగా రికార్డులో నమోదు చేశామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జూలై 2025లో దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి తాను దేశం విడిచి వెళ్లలేదని, ప్రస్తుతం విదేశీ ప్రయాణానికి ఎలాంటి ప్రణాళిక లేదా ఉద్దేశం లేదని అంబానీ స్పష్టం చేశారు. భవిష్యత్తులో విదేశీ ప్రయాణ అవసరం ఏర్పడితే ముందుగా సుప్రీంకోర్టు అనుమతి తీసుకుంటానని హామీ ఇచ్చారు.
దర్యాప్తునకు సహకరిస్తున్నాను
ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో తాను పూర్తి సహకారం అందిస్తున్నానని తెలిపారు. ఫిబ్రవరి 26, 2026న హాజరుకావాలని ఈడీసమన్లు జారీ చేసినట్లు వెల్లడించారు. ఆ రోజున విచారణకు హాజరై దర్యాప్తులో పాల్గొంటానని అండర్‌టేకింగ్ ఇచ్చారు. అలాగే, మనీలాండరింగ్ నిరోధక చట్టం–2002 (పీఎంఎల్ఏ) సెక్షన్ 50 కింద విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు. తాను పారిపోయే ప్రమాదం లేని వ్యక్తినని, చట్ట ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవాలన్న ఉద్దేశం లేదని అఫిడవిట్‌లో తెలిపారు. ఈ అఫిడవిట్‌ను నిజాయితీగా, సుప్రీంకోర్టు ముందుకు సరైన వాస్తవాలు, హామీ స్థితిని ఇచ్చేందుకు దాఖలు చేశానని, ఫిబ్రవరి 18, 2026న ముంబైలో ఈ అఫిడవిట్‌పై ధృవీకరణ చేసినట్లు రికార్డులో ఉంది. ఈ వ్యవహారం మాజీ ఐఏఎస్ అధికారి ఈ.ఏ.ఎస్. శర్మ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతో ప్రారంభమైంది. రూ.1.5 లక్షల కోట్ల బ్యాంకు మోసం ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతకుముందు సుప్రీంకోర్టు, సీబీఐ, ఈడీలకు స్టేటస్ రిపోర్టులు సమర్పించాలని ఆదేశించింది. కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.
