Let's talk: editor@tmv.in
దేశం విడిచి పారిపోయిన గోవా నైట్‌క్లబ్ యజమానులు

దేశం విడిచి పారిపోయిన గోవా నైట్‌క్లబ్ యజమానులు

Pinjari Chand
10 డిసెంబర్, 2025

గోవాలో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఘోర నైట్‌ క్లబ్ అగ్నిప్రమాదంలో ప్రధాన నిందితులుగా ఉన్న క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూథ్రాలపై ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ జారీ చేయించేందుకు సెంట్రల్ ఇన్వేష్టిగేషన్ బ్యూరో (సీబీఐ)‌ని గోవా పోలీసులు సంప్రదించారు. ఈ ఇద్దరూ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే దేశం విడిచిపెట్టి పరారైనట్లు తెలుస్తోంది.

అర్పోరాలోని ‘బిర్చ్ బై రొమియో లేన్’ నైట్‌క్లబ్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ మంటలు చెలరేగి, మొత్తం 25 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 20 మంది క్లబ్ సిబ్బంది కాగా మిగతా ఐదుగురు పర్యాటకులు. వారిలో నలుగురు ఢిల్లీకి చెందినవారే. గాయపడిన ఐదుగురు ప్రస్తుతం గోవా మెడికల్ కాలేజ్, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

అగ్నిప్రమాదం తర్వాత లూథ్రా సోదరులు ఫూకెట్ (థాయిలాండ్)కు పారిపోయినట్లు గోవా పోలీసులు సోమవారం వెల్లడించారు. వీరి గుర్తింపు, ఉన్నచోటు క్రిమినల్ దర్యాప్తుతో సంబంధం ఉన్న వివరాలు సేకరించేందుకు ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ఉపకరిస్తుంది. అధికారులు వెల్లడించిన ప్రకారం చార్జ్ షీట్ దాఖలు చేసి, కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన తర్వాతే ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ జారీ చేయడం సాధ్యమవుతుంది. అందుకు ముందు అవసరమైన ఆధారాలు సేకరించేందుకు బ్లూ నోటీస్ కోరినట్లు చెప్పారు. పరారీలో ఉన్న ఈ ఇద్దరిని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకునేందుకు ఇంటర్‌పోల్ డివిజన్‌తో సమన్వయం కొనసాగుతున్నది” అని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

నిందితులకు బీజేపీ సాయం చేస్తోంది

గోవా రెస్టారెంట్ అగ్నిప్రమాద దురంతంపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ తీవ్రంగా స్పందించారు.

గోవాలో జరిగింది చాలా విషాదకరం. నిన్న మనం వందేమాతరం గురించి చర్చించుకుంటూ ఉన్నాం. అయితే మనకు గోవాలో జరిగిన దారుణం కంటే ఇదే ఎక్కువ భావోద్వేగంగా నిలిచిందని విమర్శించారు. ఇలాంటి ప్రమాదాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నిందితుడు దేశం విడిచి పారిపోతే విషయం మరింత తీవ్రమవుతుంది. నిందితులు పారిపోవడానికి బీజేపీ సహాయం చేస్తుందని ఆరోపించారు.