Let's talk: editor@tmv.in
దేశంలో సౌభ్రాతృత్వాన్ని రాజకీయ నేతలు పెంపొందించాలి: సుప్రీంకోర్టు

దేశంలో సౌభ్రాతృత్వాన్ని రాజకీయ నేతలు పెంపొందించాలి: సుప్రీంకోర్టు

Pinjari Chand
18 ఫిబ్రవరి, 2026

దేశంలో సోదరభావం(సౌభ్రాతృత్వం)ను రాజకీయ నాయకులు పెంపొందించాలని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. రాజకీయ ప్రసంగాలపై మార్గదర్శకాలు కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) పరిశీలించిన ధర్మాసనం, పిటిషనర్లను కొత్త పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం న్యాయమూర్తులు బి.వి. నాగరత్న, జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన బెంచ్ రాజకీయ నేతల ప్రసంగాలు రాజ్యాంగ విలువలు, సౌభ్రాతృత్వంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేయాలన్న అభ్యర్థనను స్వీకరించలేదు. ఈ పిటిషన్‌ను లక్నో విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ రూఫ్ రేఖ వర్మ సహా 12 మంది దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పిటిషనర్ల తరఫున వాదించారు. ఇటీవల అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విద్వేష ప్రసంగాల ఆరోపణలపై ఈ పిటిషన్ ను వేశారు. ఇటీవల వైరల్ అయిన వీడియోపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

విచారణ ప్రారంభంలోనే కపిల్ సిబల్ మాట్లాడుతూ దేశంలో వాతావరణం విషపూరితంగా మారుతోంది. ఇది వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తి ఈ పిటిషన్ ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి చెందిన కొంతమందిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఎంచుకున్న కొంతమందిపై మాత్రమే దృష్టి పెట్టిన పిటిషన్‌ను మేము స్వీకరించలేం. నిర్దిష్టత లేకుండా, సమాన దృష్టితో దాఖలు చేయాలని సీజేఐ తెలిపారు. అవసరమైతే నిష్పాక్షికంగా దాఖలైన పిటిషన్‌ను పరిశీలించేందుకు కోర్టు సిద్ధంగా ఉందని చెప్పారు.

ఆలోచనలను ఎలా నియంత్రిస్తాం

న్యాయమూర్తి నాగరత్న మాట్లాడుతూ రాజకీయ నాయకులు దేశంలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని స్పష్టం చేశారు. మార్గదర్శకాలు జారీ చేస్తే వాటిని ఎవరు పాటిస్తారు? మాటల మూలం ఆలోచన. ఆలోచనలను ఎలా నియంత్రిస్తాం? అని ప్రశ్నించారు. న్యాయమూర్తి బాగ్చి కూడా, కోర్టు ఆదేశాలు ఇవ్వగలదే గాని అమలు చేయడం పెద్ద సవాలుగా మిగులుతుందని వ్యాఖ్యానించారు. ద్వేష ప్రసంగాలు, భావ ప్రకటన స్వేచ్ఛపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలు మార్గదర్శక సూత్రాలు నిర్దేశించిందని గుర్తుచేశారు. పిటిషనర్లు ఎన్నికల సమయంలో అమలులోకి వచ్చే ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)కి ముందుగా చేసిన ప్రసంగాలు సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల సమయంలోనూ ప్రచారం అవుతున్నాయని, మీడియా బాధ్యతపై స్పష్టత అవసరమని వాదించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే సేవా నియమావళులకు లోబడి ఉన్నారని, ఇప్పటికే ఉన్న న్యాయపరమైన ప్రమాణాలే సరిపోతాయని ధర్మాసనం సూచించింది.