Let's talk: editor@tmv.in
దేశంలో రక్తమోడిన రహదారులు

దేశంలో రక్తమోడిన రహదారులు

Pinjari Chand
1 డిసెంబర్, 2025

దేశంలోని రోడ్లు ఆదివారం రక్తమోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో సుమారు 17 మంది మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రంలో రెండు ప్రభుత్వ బస్సులు ఢీకొన్న సంఘటనలో 11 మంది మృతి చెందారు. సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చి పలు వాహనాలను ఢికొట్టింది. దీంతో అక్కడికక్కడే మరణించారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు ముగ్గురిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు ప్రమాద స్థలంలోనే మరణించాడు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

తమిళనాడులోని సివగంగై జిల్లాలో

సివగంగై జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రెండు బస్సులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో 8 మంది మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. కారైకుడి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణం పూర్తిగా తెలియరాలేదని, దానిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు.

బీహార్‌లో వేగంగా వచ్చి వాహనాలను ఢీకొన్న లారీ

బీహార్‌ రాష్ట్రం తూర్పు చంపారన్ జిల్లాలో వేగంగా వచ్చిన లారీ ఒకేసారి పలు వాహనాలను ఢీకొనడంతో 5 మంది అక్కడికక్కడే మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన మోతిహారికి చెందిన కోట్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి-27పై జరిగింది. సర్వీస్ రోడ్డులో రోడ్డు దాటేందుకు వేచి ఉన్న మోటార్ సైకిళ్లు, ఆటో రిక్షా సహా అనేక వాహనాలను లారీ బలంగా ఢీకొట్టిందని డీఎస్పీ (సదర్-1) దిలీప్ కుమార్ తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఘటన అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. డ్రైవర్ నిద్రలో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందన్న అనుమానం వ్యక్తమైంది. ప్రమాదంతో ఆగ్రహానికి గురైన స్థానికులు రహదారిని దిగ్బంధించి, ఒక ఎన్హెచ్ఏఐ వాహనాన్ని దహనం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఢిల్లీలో మెర్సిడెస్ బీభత్సం

ఢిల్లీలో వసంత్ కుంజ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడు మృత్యువాత పడ్డాడు. మెర్సిడెస్ ఎస్యూవీ ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టడంతో ఓ యువకుడు స్పాట్ లోనే మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం నెల్సన్ మండేలా మార్గ్‌ వద్ద ఉన్న ఒక మాల్ సమీపంలో జరిగింది. గాయపడిన ముగ్గురూ అంబియన్స్ మాల్‌లోని ఒక రెస్టారెంట్ ఉద్యోగులే. తమ పనివేళ ముగిసిన తర్వాత, మునిర్కా లోని ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారిని ఆసుపత్రికి తరలించగా రోహిత్ (23) అనే ఉత్తరాఖండ్ చమోలీ జిల్లా యువకుడు అప్పటికే మరణించగా, కపిల్, లలిత్ చికిత్స పొందుతున్నారు. కపిల్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి ముందు కారు డివైడర్‌ను ఢీకొట్టి, కంబాన్ని తాకి, ఒక్కసారిగా ఆటో స్టాండ్ వైపు దూసుకెళ్లిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

దేశంలో రక్తమోడిన రహదారులు - Tholi Paluku