
దేశంలో ముడి చమురు కొరత లేదు: పెట్రోలియం మంత్రిత్వ శాఖ
దేశంలో ముడి చమురు కొరత లేదని, ఇంధన సరఫరా ఎక్కడా అంతరాయం లేకుండా కొనసాగుతోందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ, సహజవాయు మంత్రిత్వ శాఖ సోమవారం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు సాధారణంగా పనిచేస్తున్నాయని తెలిపింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖలో మార్కెటింగ్, ఆయిల్ రిఫైనరీ విభాగం సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశంలో ముడి చమురు తగినంతగా అందుబాటులో ఉందన్నారు. అన్ని రిఫైనరీలు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఎక్కడా ఇంధన కొరత లేదా బంకులు ఖాళీ అయిన ఘటనలు నమోదుకాలేదని చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో ఇంధన లభ్యతపై ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా రిటైల్ అవుట్‌లెట్లలో ఇంధనం నిరంతరంగా అందుబాటులో ఉండేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఎల్‌పీజీ తీసుకువస్తున్న భారత జెండా కలిగిన నౌక శివాలిక్ త్వరలోనే గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు చేరుకోనుందని కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి రాజేశ్ కుమార్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం, పర్షియన్ గల్ఫ్ నుంచి బయలుదేరిన ఈ నౌక హర్ముజ్ జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణిస్తోంది. నౌక సాయంత్రం సమయానికి ముంద్రా పోర్టుకు చేరుకునే అవకాశం ఉందన్నారు. నౌక చేరుకునే ముందే అవసరమైన డాక్యుమెంటేషన్, ప్రాధాన్యత బెర్తింగ్ వంటి ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
అలాగే యూఏఈ నుంచి మార్చి 14న బయలుదేరిన జాగ్ లాడ్‌కీ అనే భారత జెండా నౌక సుమారు 81 వేల టన్నుల ముర్బన్ ముడి చమురుతో భారత్‌కు సురక్షితంగా ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఈ నౌక కూడా త్వరలోనే ముంద్రా పోర్టుకు చేరుకోనుందని చెప్పారు. ఇక పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయ నౌకాదళ సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ 22 భారత జెండా నౌకల్లో మొత్తం 611 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఇదే సమయంలో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి పూర్తిగా తెరవడానికి భారత్ ప్రస్తుతం ఇరాన్‌తో చర్చలు జరుపుతోందన్నారు. ఈ చర్చలు ఇప్పటికే కొంత ఫలితాన్ని ఇస్తున్నాయని, సమస్యను పరిష్కరించడానికి ఇరాన్‌తో సమన్వయం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇటీవల శివాలిక్, నందాదేవి వంటి భారత జెండా నౌకలు విజయవంతంగా ప్రయాణించడం ఈ దౌత్య ప్రయత్నాల ఫలితమేనని ఆయన తెలిపారు. అయితే అన్ని భారత నౌకలకు ఒకేసారి అనుమతి ఇచ్చే విధమైన పూర్తి ఏర్పాట్లు ఇంకా అమల్లోకి రాలేదని, ప్రస్తుతం కేసు వారీగా అనుమతులు ఇస్తున్నట్లు చెప్పారు.
