
దేశంలో మరో 14 ఫోరెన్సిక్ క్యాంపస్‌లకు కేంద్రం ఆమోదం
దేశంలో నేర దర్యాప్తు వ్యవస్థను మరింత శాస్త్రీయంగా, సమర్థవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి(ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ ) 14 కొత్త క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే గాంధీనగర్ (గుజరాత్), ఢిల్లీలో ఉన్న క్యాంపస్‌లకు అదనంగా గోవా, అగర్తలా (త్రిపుర), భోపాల్ (మధ్యప్రదేశ్), ధార్వాడ్ (కర్ణాటక), గువాహటి (అస్సాం), నాగ్‌పూర్ (మహారాష్ట్ర), ఖోర్ధా (ఒడిశా), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), చెంగళ్పట్టు (తమిళనాడు)తో పాటు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్త క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భూమి ఇప్పటికే కేటాయించగా, కొన్ని క్యాంపస్‌లు తాత్కాలిక (ట్రాన్సిట్) సదుపాయాల్లోనే ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. శాశ్వత మౌలిక సదుపాయాల నిర్మాణం కొనసాగుతోంది. దేశంలో ఫోరెన్సిక్ సామర్థ్యాన్ని పెంచేందుకు దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు పెంపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. శాస్త్రీయ ఆధారాలపై దర్యాప్తు వేగం, నాణ్యత మెరుగుపడేందుకు ఈ చర్యలు దోహదపడతాయని పేర్కొన్నారు.
ఫోరెన్సిక్ విద్య, పరిశోధన, సేవల మధ్య సమన్వయం పెంచేందుకు కొన్ని రాష్ట్రాల్లో కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలతో కలిసి (కో-లోకేషన్) క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏర్పాట్లు ఉండనున్నాయి. ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ ద్వారా అడ్వాన్స్‌డ్ డీఎన్‌ఏ అనాలిసిస్, సైబర్ ఫోరెన్సిక్స్, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఫోరెన్సిక్ సైకాలజీ, నార్కోటిక్ డ్రగ్స్ విశ్లేషణ, బాలిస్టిక్ ఫోరెన్సిక్స్ వంటి అత్యాధునిక సాంకేతిక సేవలు అందిస్తున్నారు. యూనివర్సిటీ 60కి పైగా కోర్సులు (బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటેక్, ఎంబీఏ, పీహెచ్‌డీ) అందిస్తోంది. క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్ కూడా ఈ కోర్సుల్లో ముఖ్య భాగంగా ఉండగా, పోలీసు, న్యాయ వ్యవస్థలో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే దేశంలో చండీగఢ్, ఢిల్లీ, కమ్రూప్ (అస్సాం), కోల్‌కతా, భోపాల్, పుణే, హైదరాబాద్‌లలో 7 సీఎఫ్‌ఎస్‌ఎల్‌లు పనిచేస్తుండగా, జమ్మూ-కాశ్మీర్, రాజస్థాన్, తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కేరళ రాష్ట్రాల్లో మరో 8 కొత్త సీఎఫ్‌ఎస్‌ఎల్‌ల ఏర్పాటుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ చర్యలతో నేరాల దర్యాప్తు మరింత శాస్త్రీయంగా మారి, న్యాయ ప్రక్రియ వేగవంతం అవుతుందని కేంద్రం భావిస్తోంది.
