Let's talk: editor@tmv.in
దేశంలో ప్రతి 50 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్టు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

దేశంలో ప్రతి 50 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్టు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Panthagani Anusha
15 నవంబర్, 2025

భారతదేశ విమానయాన రంగం అపూర్వమైన వృద్ధిని సాధిస్తోందని, దేశంలో ప్రతి 50 రోజులకు ఒక కొత్త విమానాశ్రయం ప్రారంభమవుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి వేగం కనిపించదని ఆయన తెలిపారు.

విశాఖపట్నంలో శుక్రవారం జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభ సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రసంగిస్తూ విమానాశ్రయాల నిర్మాణం, ప్రయాణీకుల సామర్థ్యం పెంపుదల, తర విమానయాన విభాగాలలో దేశం సాధించిన విజయాలను ఆయన ఈ సందర్భంగా హైలైట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏవియేషన్ హబ్

దేశవ్యాప్తంగా జరుగుతున్న విమానయాన రంగ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక లబ్ధిదారుగా ఉందని స్పష్టమవుతోంది. రాష్ట్రాన్ని లాజిస్టిక్స్, ఏవియేషన్ హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వం ముఖ్యమైన చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు విమానాశ్రయాలు (ఎయిర్‌పోర్ట్స్) అందుబాటులో ఉండగా మరో ఏడు కొత్త విమానాశ్రయాలు (ఏరోడ్రోమ్స్) రానున్నట్లు ప్రకటించారు. కేవలం విమానాశ్రయాల వృద్ధతో పాటుగా విమానయాన రంగానికి మద్దతుగా రాష్ట్రంలో పటిష్టమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు ఫ్లైట్-ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు రాష్ట్రానికి రాబోతున్నాయి. అంతేకాక విశాఖపట్నం కేంద్రంగా విమానాల నిర్వహణ కోసం ఒక ఎకోసిస్టమ్, ఏవియేషన్ స్కిల్లింగ్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు కానున్నాయి అని వెల్లడించారు

డ్రోన్ సిటీ, తయారీ రంగం

విమానయాన రంగంతోపాటు డ్రోన్ రంగం విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది ఇందులో భాగంగా రాష్ట్రంలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఏరోస్పేస్, విమానతయారీ రంగాలను రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

దేశం సుదీర్ఘకాల లక్ష్యమైన 2047 గురించి మాట్లాడుతూ, ఈ కాలాన్ని సవాళ్ల సమయంగా కాకుండా అనంతమైన అవకాశాల కాలంగా చూడాలని మంత్రి అన్నారు. డబుల్-ఇంజన్ సర్కార్ బలం వల్లే రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాల సమన్వయం, స్పష్టత, విశ్వాసం కారణంగా ఈ పురోగతి సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం: 2026 జూన్‌లో ప్రారంభం

మరోవైపు విశాఖపట్నం సమీపంలో నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ఊపందుకున్నాయి. ఈ విమానాశ్రయం షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే అంటే 2026 జూన్ నాటికి పూర్తి కానున్నట్లు జీఎంఆర్ గ్రూప్ స్థాపక అధ్యక్షుడు జీఎం రావు శుక్రవారం ప్రకటించారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణాల కోసమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద విమాన నిర్వహణ, మరమ్మతు, సమగ్ర సేవలు (ఎంఆర్ఓ) అందించే కేంద్రానికి నిలయంగా మారుతుందని తెలిపారు.

500 ఎకరాల్లో ఏరోస్పేస్ పార్క్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా జీఎంఆర్ గ్రూప్ 500 ఎకరాల విస్తీర్ణంలో ఒక సమగ్ర ఏరోస్పేస్ పార్కును అభివృద్ధి చేస్తోంది. ఈ పార్కు ద్వారా విమాన తయారీదారులు, పరిశోధన సంస్థలు, శిక్షణ కేంద్రాలు,రక్షణ రంగ సంస్థలను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయత్నం స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని జీఎం రావు పేర్కొన్నారు.

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం నమూనాలో రూపొందుతున్న ఈ భోగాపురం విమానాశ్రయం ప్రారంభించిన తర్వాత సంవత్సరానికి అరవై లక్షల ప్రయాణీకులకు సేవలు అందించే సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది.

దేశంలో ప్రతి 50 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్టు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు - Tholi Paluku