
దేశంలో పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్
దేశంలో పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మరోసారి నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గానూ తొలి తొమ్మిది నెలల కాలంలో దేశవ్యాప్తంగా ప్రకటించిన పెట్టుబడుల్లో ఏకంగా 25.3 శాతం వాటాను ఆకర్షించి రాష్ట్రం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో నిలిచిన ఆంధ్రప్రదేశ్, పెట్టుబడుల పరంగా దేశానికి దిశానిర్దేశం చేస్తోందని నివేదిక స్పష్టం చేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా గణాంకాల ప్రకారం 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికంలో పరిశ్రమల పెట్టుబడుల ఊపు తూర్పు, దక్షిణ కారిడార్ల వైపు మళ్లింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ 25.3 శాతంతో అగ్రస్థానంలో ఉండగా ఒడిశా 13.1 శాతం, మహారాష్ట్ర 12.8 శాతం వాటాలతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మొత్తం ప్రతిపాదిత పెట్టుబడుల్లో 51.2 శాతం మేరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలే ఆకర్షించటం గమనార్హం.
ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే, పొరుగు రాష్ట్రం తెలంగాణ 9.5 శాతం పెట్టుబడులతో తదుపరి స్థానంలో నిలిచింది. గుజరాత్ 7.1 శాతం, తమిళనాడు 4.9 శాతం, రాజస్థాన్ 4.3 శాతం, ఛత్తీస్‌గఢ్ 3.9 శాతం వాటాలను నమోదు చేశాయి. మధ్యప్రదేశ్ 3.2 శాతం, ఉత్తరప్రదేశ్ 2.7 శాతం, పశ్చిమ బెంగాల్ 2.6 శాతం, కర్ణాటక 2.1 శాతం వాటాలతో కొనసాగగా, అస్సాం, ఝార్ఖండ్ రాష్ట్రాలు రెండూ 0.9 శాతం చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి.
ఈ ఆర్థిక సంవత్సరపు తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం పెట్టుబడి ప్రకటనలు గత ఏడాదితో పోలిస్తే 11.5 శాతం పెరిగి రూ. 26.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రంగాల వారీగా పరిశీలిస్తే, మొత్తం పెట్టుబడుల్లో ఇంధన రంగం 22 శాతం, రసాయన పరిశ్రమలు 21 శాతం, లోహ ఉత్పత్తులు 17 శాతం, ఐటీ రంగం 10 శాతం వాటాను దక్కించుకున్నట్లు నివేదిక పేర్కొంది.
రాష్ట్రం సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక విధానాలు, "స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మంత్రమే ఈ ఘనతకు కారణమని ఆయన పేర్కొన్నారు. కేవలం ఎర్ర తివాచీలు పరచడమే కాకుండా, పెట్టుబడిదారులకు అవసరమైన అనుమతులు మెరుపు వేగంతో ఇవ్వడం వల్లనే ప్రపంచ స్థాయి కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయని తెలిపారు. ఈ గణాంకాలు రాష్ట్ర ప్రజలకు గొప్ప శుభవార్త అని పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ ఇదే జోరును కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
