
దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదు: ఇండియన్ ఆయిల్
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల వల్ల ఇంధన మార్కెట్లు ప్రభావితమైనప్పటికీ, దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) స్పష్టం చేసింది. దేశీయంగా గ్యాస్ లభ్యతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నిల్వలు తగినంతగా ఉన్నాయని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఉద్రిక్తతలు మొదలవ్వకముందు ఏ స్థాయిలో సరఫరా ఉండేదో, ఇప్పుడు కూడా అదే స్థాయిలో రోజుకు సగటున 28 లక్షల సిలిండర్లను వినియోగదారుల ఇళ్లకు చేరుస్తున్నట్లు వెల్లడించింది. గ్యాస్ కొరత ఉందనే భయంతో ముందస్తుగా బుక్ చేయడం, నిల్వ చేసుకోవడం వంటివి చేయవద్దని కోరింది.
డిజిటల్ బుకింగ్.. పారదర్శక పంపిణీ
గ్యాస్ పంపిణీలో పారదర్శకత కోసం సాంకేతికతను వినియోగిస్తున్నట్లు ఐఓసీ వివరించింది. ప్రస్తుతం 87 శాతం మంది వినియోగదారులు ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ వంటి డిజిటల్ పద్ధతుల్లోనే గ్యాస్ బుక్ చేసుకుంటున్నారని తెలిపింది. సిలిండర్ డెలివరీ చేసే సమయంలో 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనివల్ల అసలైన వినియోగదారుడికే సిలిండర్ చేరుతుందని పేర్కొంది. సోషల్ మీడియా ద్వారా వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా
కొందరు డీలర్లు గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఐఓసీ తెలిపింది. ఇలాంటి అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర చమురు సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా సుమారు 68 వేల దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు 855 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి, 48 వేల సిలిండర్లను సీజ్ చేసినట్లు వివరించింది. నిబంధనలు ఉల్లంఘించిన 141 మంది డిస్ట్రిబ్యూటర్లపై చర్యలు తీసుకోగా, అందులో ఐదుగురిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. కేవలం అధికారిక మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, వదంతులకు తావు ఇవ్వవద్దని ఐఓసీ వినియోగదారులను కోరింది.
