
దేశంలో అత్యంత అవినీతి సీఎం హిమంత: రాహుల్ గాంధీ
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతి పరుడైన సీఎం అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కలిసి అస్సాంలో ‘ల్యాండ్ ఏటీఎం’ నడుపుతున్నారని విమర్శించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం కర్బీ ఆంగ్లాంగ్, జోర్హాట్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల సభల్లో రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రజల నుంచి భూములను స్వాధీనం చేసుకుని పెద్ద కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుటుంబం కూడా అవినీతి విషయంలో మొదటి స్థానంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రస్తుతం సీఎం శర్మ ధైర్యంగా మాట్లాడుతున్నప్పటికీ, చట్టం ముందు ఆయన తప్పించుకోలేరని అన్నారు. ఈ రోజు ఎంత గొప్పగా మాట్లాడుతున్నా, ఒక రోజు చట్టం ముందు నిలబడాల్సిందే. అప్పుడు ఆయన పూర్తిగా మౌనంగా మారిపోతారని వ్యాఖ్యానించారు. అస్సాంలో భూముల కేటాయింపుల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. మూడు పెద్ద కార్పొరేట్ సంస్థలకు కలిపి 98,400 బీఘాల భూమిని అప్పగించారని తెలిపారు. మోడీ, షా, శర్మ కలిసి అస్సాంలో ల్యాండ్ ఏటీఎం ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి భూమిని తీసుకుని పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్నారని విమర్శించారు.
జుబీన్‌గార్గ్‌కు న్యాయం చేస్తాం
గత సంవత్సరం సింగపూర్‌లో మునిగి మరణించిన ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్‌గార్గ్ గురించి కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఆయన అస్సాం ఆత్మను ప్రతిబింబించిన వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆయన మరణంపై న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. బీజేపీ మాత్రం అస్సాంను ఢిల్లీ నుంచి పాలించాలని చూస్తోందని విమర్శించారు. అస్సాం బహుళ సంస్కృతులు, భాషలు, మతాలు కలిసిన రాష్ట్రం అని పేర్కొంటూ ప్రజలు పుష్పగుచ్ఛంలా కలిసి జీవించాలని కాంగ్రెస్ భావిస్తుందని చెప్పారు.
ఆదివాసీలకు హక్కులు కల్పిస్తాం
ఆదివాసీ ప్రాంతాలకు అధిక స్వయం పాలన కల్పించేలా ఆర్టికల్ 244ఏను పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కర్బీ ఆంగ్లాంగ్ సహా ఆరో షెడ్యూల్ ప్రాంతాలను స్థానిక ప్రజలే పాలించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీ తోటల కార్మికులకు రోజువారీ కూలీని రూ.350కి పెంచుతామని గత ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చినా అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఈసారి మళ్లీ రూ.500కి పెంచుతామని చెబుతున్నారని, ఇది కూడా మరో తప్పుడు హామీ అని అన్నారు. అలాగే అనేక సంవత్సరాలుగా ఎస్టీ హోదా కోసం డిమాండ్ చేస్తున్న ఆరు సముదాయాలకు ఇప్పటికీ ఆ హోదా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఐదు హామీలను కూడా ఆయన వివరించారు. ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాకు నెలవారీ ఆర్థిక సహాయం, వ్యాపారం ప్రారంభించేందుకు అదనంగా రూ.50,000 సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య బీమా కల్పించడంతో పాటు 10 లక్షల స్థానిక ప్రజలకు భూ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
