
దేశంలోనే తొలిసారి... బేగంపేట రన్‌వే కింద అండర్ గ్రౌండ్ ట్రాఫిక్ టన్నెల్
నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్నమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా బేగంపేట విమానాశ్రయ రన్‌వే కింద ప్రపంచంలోనే తొలిసారిగా ఒక అండర్ గ్రౌండ్ ట్రాఫిక్ టన్నెల్ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సోమవారం శాసనమండలిలో ప్రకటించారు. సోమవారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. రోడ్లను అండర్ పాస్, సర్ఫేస్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లుగా విభజించి 29 ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ఉత్తర భాగం నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చే వాహన రద్దీని తగ్గించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ టన్నెల్ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు పొందినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా విమానాశ్రయ రన్‌వే కింద ట్రాఫిక్ అండర్‌పాస్ నిర్మించలేదని, ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాజెక్ట్‌కు అనుమతులు తీసుకువచ్చామని, ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం బేగంపేట ఎయిర్‌పోర్ట్ పరిమిత కార్యకలాపాలకే వాడుతున్నప్పటికీ, రన్‌వే కింద టన్నెల్ నిర్మించడం సాంకేతికంగా ఒక అద్భుతమని ఆయన అభివర్ణించారు.
కరీంనగర్, మేడ్చల్ మార్గాల్లో బాటిల్ నెక్స్‌ను తొలగించేందుకు రక్షణ శాఖ నుంచి 153 ఎకరాల భూమిని సేకరించి, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. రక్షణ శాఖకు భూమికి బదులుగా భూమి కేటాయించాం అని సీఎం అన్నారు. నల్గొండ చౌరస్తా వద్ద ఎలివేటెడ్ కారిడార్ జూన్ లేదా జూలై నాటికి అందుబాటులోకి రానుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నుంచి రాయదుర్గం నాలెడ్జ్ పార్క్ వరకు కొత్తగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించి, దానిని పీవీ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని సీఎం వివరించారు. నగరంలో ఎక్కడా ప్రయాణానికి ఆటంకం లేకుండా నిరంతర సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా ఈ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
ఇదే సందర్భంలో ముసీ నది అభివృద్ధి ప్రాజెక్ట్‌పై కూడా ముఖ్యమంత్రి స్పందించారు. ఈ ప్రాజెక్ట్ అమలులో భాగంగా తమ భూములు లేదా ఇళ్లు కోల్పోయే ప్రజలను పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కూడిన కేబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
దేశంలోని ప్రముఖ మహానగరాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు కాలుష్యం, నీటి కాలువల సమస్యలు, ట్రాఫిక్ రద్దీ వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ఈ సమస్యల విషయంలో మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, ముందస్తు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశముందని హెచ్చరించారు.
మూసీ వెంట హిమాయత్ సాగర్ నుంచి గౌరవెల్లి వరకు 43 కి.మీ మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. అలాగే ఆపరేషన్ రోప్ ద్వారా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు, కేబీఆర్ పార్క్, నాంపల్లిలో మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 783 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న కోర్ అర్బన్ రీజియన్ అభివృద్ధి కోసం హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్
కార్పొరేషన్లను ఒకే గొడుగు కిందకు తెచ్చి పరిపాలనను సులభతరం చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.
గోదావరి జలాలతో మూసీకి కళ
నగర దాహార్తిని తీర్చడంతో పాటు మూసీకి పూర్వవైభవం తెచ్చేందుకు 20 టీఎంసీల గోదావరి జలాలను తరలించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇందులో 17 టీఎంసీలను తాగునీటి అవసరాలకు, మిగిలిన నీటిని మూసీలో నిరంతర ప్రవాహం ఉండేలా ఉపయోగిస్తామన్నారు. అలాగే హిల్ట్ పాలసీ ద్వారా నగరంలోని పారిశ్రామిక భూములను యాజమాన్య హక్కులు మార్చకుండానే మల్టీ-యూజ్ జోన్లుగా మార్చి, మధ్యతరగతి ప్రజల కోసం నివాస ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే దిశగా ఈ ప్రాజెక్ట్ భాగమని సీఎం వివరించారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని మూడు ప్రధాన ఆర్థిక ప్రాంతాలుగా విభజించినట్లు చెప్పారు. అవి కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ (క్యూర్), పెరి అర్బన్ రీజన్ ఎకానమీ (ప్యూర్ ), రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ (రేర్). ఈ విధానంతో నగరాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి సమతుల్యంగా కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్యూర్ ప్రాంతంలో ఉన్న కాలుష్య పరిశ్రమలను ప్యూర్ ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీని వల్ల నగర ప్రజలకు మరింత స్థలం, శుభ్రమైన వాతావరణం లభిస్తుందని పేర్కొన్నారు.
మెట్రో రైలు విస్తరణ రూ.15,000 కోట్ల
అదనంగా, హైదరాబాద్ మెట్రో రైల్‌పై కూడా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ మెట్రో ఒకప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉండగా, గత పదేళ్లలో విస్తరణ లేక 9వ స్థానానికి పడిపోయిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్‌అండ్‌టి సంస్థ నుంచి రూ. 15,000 కోట్ల వ్యయంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు. అలాగే మెట్రో రైల్‌ను మరో 76 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగరానికి ఎక్కడి నుంచి అయితే ట్రాఫిక్ ప్రారంభమయ్యే హయత్‌నగర్, రామచంద్రాపురం లాంటి లాస్ట్‌మైల్ కనెక్టివిటీ ప్రాంతాలకు మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
మెట్రో రైల్ వ్యవస్థను నగరంలోని విమానాశ్రయంతో అనుసంధానం చేయడం అవసరమని సీఎం పేర్కొన్నారు. ఇతర నగరాల్లో మెట్రో సౌకర్యం విమానాశ్రయంతో అనుసంధానం ఉండగా, హైదరాబాద్‌లో అది లేకపోవడం వల్ల ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మెట్రో రెండో దశ విస్తరణకు రూ. 24,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
ఇక ప్రాంతీయ రింగ్ రోడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి కూడా ఒక కీలక సమాచారం వెల్లడించారు. ప్రతిపాదిత 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్‌లో ఒక భాగానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
