
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో “జీఐ ఆన్ వీల్స్” ప్రారంభం
తెలంగాణ విశిష్ట హస్తకళలను, భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొదటిసారిగా చేపట్టిన “జీఐ ఆన్ వీల్స్” కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) వద్ద రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, జీఐ గుర్తింపు పొందిన కళారూపాలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకలని పేర్కొన్నారు. గ్రామీణ కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణ కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “జీఐ ఆన్ వీల్స్” కార్యక్రమం గవర్నర్ దూరదృష్టి ఫలితమని తెలిపారు. జీఐ ఉత్పత్తుల ప్రాచుర్యం, మార్కెటింగ్, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఈ చర్యల ద్వారా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరిగి, వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
బస్సులపై కొలువుదీరిన ఆరు కళారూపాలు
గవర్నర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణకు చెందిన ఆరు ప్రముఖ జీఐ హస్తకళలను ప్రత్యేక బస్సులపై ప్రతిష్టించారు. వాటిలో పోచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీలు (కార్పెట్లు), కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నారాయణపేట్ చీరలు, చెరియల్ స్క్రోల్ పెయింటింగ్స్, అలాగే నిర్మల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ కళారూపాలు తెలంగాణ కళాకారుల నైపుణ్యానికి ప్రతీకలుగా నిలుస్తూ, ప్రజా రవాణా ద్వారా విస్తృత ప్రచారం పొందనున్నాయి. ఈ బస్సులపై ప్రదర్శించిన డిజైన్లను జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) విద్యార్థులు రూపొందించారు. విద్యార్థుల సృజనాత్మకతకు గుర్తింపుగా నగదు బహుమతులు, మెమొంటోలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీజీఎస్‌ఆర్టీసీ వైస్ ఛైర్మన్ & ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, టీజీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రతినిధులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గవర్నర్, మంత్రి, అధికారులు కలిసి జీఐ హస్తకళలతో అలంకరించిన ప్రత్యేక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం తెలంగాణ హస్తకళలకు కొత్త గుర్తింపు తీసుకురావడంతో పాటు, కళాకారుల జీవితాల్లో సానుకూల మార్పులకు దోహదపడనుంది.
