
దేశంలోనే తొలిసారిగా విశాఖ పోర్ట్‌కు “శివాలిక్” నౌక
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యం కిందకు వచ్చే వీఎల్‌జీసీ (వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్) నౌక దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నం పోర్ట్‌కు వస్తున్న సందర్భంగా కేంద్ర పోర్టులు నౌక, జలరవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ సోమవారం విశాఖలో ఘనంగా స్వాగతం పలకనున్నారు.
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల 2025 సెప్టెంబర్ 10న “శివాలిక్” నౌకను భారత జెండా కింద నమోదు చేసుకుని స్వాధీనం చేసుకుంది. ఇది భారత సముద్ర రవాణా రంగంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోంది. భారత యాజమాన్యం, భారత జెండా కింద నడుస్తున్న ఈ నౌక, విశాఖపట్నం పోర్ట్‌కు తన తొలి ప్రయాణంలో ఎల్‌పీజీ సరుకును తీసుకురానుంది. ఈ సందర్భంగా భారత గ్యాస్ లాజిస్టిక్స్ సామర్థ్యాలను మరింతగా బలోపేతం చేయడమే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక అడుగుగా నిలుస్తుంది.
“శివాలిక్” నౌక భారత జెండా కింద దేశానికి ఇదే మొట్టమొదటిసారి రావడం భారత షిప్పింగ్ రంగానికి గర్వకారణమైన ఘట్టం అని అధికారులు తెలిపారు. “శివాలిక్” నౌక ప్రారంభం తూర్పు తీరంలో సముద్ర వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ, విశాఖపట్నం పోర్ట్‌ను శక్తి, సరుకు రవాణాకు ప్రధాన ద్వారంగా నిలబెడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఈ కార్యక్రమానికి సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేస్తోంది. మంత్రిత్వ శాఖ, ఎస్‌సిఐ, విపిఎ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
