Let's talk: editor@tmv.in
దేశంలోనే తొలిసారిగా ఏపీలో 'బీసీ రక్షణ చట్టం': మంత్రి సవిత

దేశంలోనే తొలిసారిగా ఏపీలో 'బీసీ రక్షణ చట్టం': మంత్రి సవిత

Gaddamidi Naveen
6 ఆగస్టు, 2026

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాల (బీసీ) సామాజిక, ఆర్థిక భద్రతను నిర్ధారించేందుకు, వారి గౌరవప్రదమైన జీవనానికి రక్షణగా దేశంలోనే మొట్టమొదటిసారిగా 'బీసీ రక్షణ చట్టం' తీసుకొస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్‌లో బుధవారం బీసీ ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన ముసాయిదా చట్టం సమీక్షా సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి కూటమి ప్రభుత్వం ఈ చట్టానికి తుదిరూపు ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. బీసీలను కులం లేదా వృత్తి పేరుతో దూషించినా, వేధించినా ఈ చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయని, కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ముసాయిదాపై త్వరలోనే జిల్లా స్థాయిలోనూ బీసీ సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించి, జాతీయ బీసీ కమిషన్ ఆమోదం పొందిన వెంటనే రాష్ట్ర శాసనసభలో బిల్లును ప్రవేశపెడతామని వెల్లడించారు.

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో బీసీలను తీవ్రంగా వేధించిందని విమర్శించారు. లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రెండేళ్లుగా విస్తృత చర్చలు జరిపి ఈ చట్టాన్ని రూపుదిద్దినట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం తగ్గించిన బీసీ రిజర్వేషన్లను రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా తిరిగి 34 శాతానికి పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఈ కీలక సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎన్.ఎండి. ఫరూక్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొని పటిష్టమైన చట్ట రూపకల్పనకు పలు సూచనలు చేశారు.