
దేవ్‌జీ 40 ఏళ్ల అజ్ఞాతవాసానికి స్వస్తి.. చట్టబద్ధంగా రాజకీయ ప్రయాణం!
తెలంగాణలో కీలక మావోయిస్టు నాయకుడు, సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అజ్ఞాత జీవితాన్ని వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఆయనతో పాటు మరో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజి రెడ్డి కూడా లొంగిపోయారు. వీరితో పాటు బాడే చొక్కారావు అలియాస్ జగన్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న కూడా ఆయుధాలు వదిలి ప్రధాన స్రవంతిలోకి వచ్చారు. రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి సమక్షంలో వీరు లాంఛనంగా లొంగిపోయారు.
పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం, నిషేధిత భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) సంస్థలో కీలక వ్యూహకర్తగా గుర్తింపు పొందిన దేవ్‌జీ నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2001లో బాధ్యతలు చేపట్టగా, 2017 నుంచి కేంద్ర సైనిక కమిషన్ ఇన్‌చార్జిగా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని భావించినప్పటికీ, ఆ సమావేశాలు జరగకపోవడంతో పరిస్థితులు మారాయని అధికారులు పేర్కొన్నారు.
ఆరోగ్య కారణాలతోనే ఈ నిర్ణయం
లొంగుబాటు అనంతరం దేవ్‌జీ మీడియాతో మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యల కారణంగానే తాను అజ్ఞాత జీవితాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే, తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని, భవిష్యత్తులో ప్రజల సమస్యలపై "చట్టబద్ధమైన పద్ధతుల్లో" పోరాడుతానని, తన రాజకీయ ప్రయాణాన్ని చట్ట పరిధిలోనే కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.
దేవ్‌జీ నేపథ్యం - ప్రస్థానం
దేవ్‌జీ స్వస్థలం తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన దేవ్‌జీ, ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వెంకటనర్సయ్య వ్యవసాయదారుడని సమాచారం. ప్రాథమిక విద్య ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిచేసిన తర్వాత ఇంటర్మీడియట్ చదువు కోసం కొరుట్లకు వెళ్లిన ఆయన రాడికల్ విద్యార్థి ఉద్యమాల ప్రభావంతో రాజకీయ కార్యకలాపాల్లోకి ప్రవేశించారు. అప్పట్లో నిర్వహించిన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఉద్యమాలు, జైత్రయాత్ర, పీపుల్స్ వార్ చేపట్టిన భూపోరాటాల వంటి సామాజిక ఆందోళనలు ఆయనపై ప్రభావం చూపినట్లు పోలీసులు వెల్లడించారు.
తిప్పిరి తిరుపతి 1982 జనవరిలో అప్పటి పీపుల్స్ వార్ లో చేరి ప్రధానంగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించారు. ఉద్యమంలో క్రమంగా ఎదుగుతూ 2001లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, తరువాత మిలిటరీ కమిషన్ బాధ్యతలతో కీలక నేతగా మారారు.
మల్లా రాజిరెడ్డి, ఇతర నేతలు
లొంగిపోయిన మరో నేత మల్లా రాజి రెడ్డి 76 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి. ఆయన స్వస్థలం పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందినవారు. 1971లో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసిన తర్వాత 1974లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరి విప్లవ రాజకీయాల్లోకి ప్రవేశించారు. లొంగుబాటు తర్వాత ఆయన మాట్లాడుతూ.. మావోయిజం ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతుందని, తాము చట్టబద్ధమైన పరిమితుల్లో ఉంటూనే ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొన్నారు. మిగిలిన నేతలకు ఇచ్చే సందేశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని ఆయన వెల్లడించారు.
ఈ లొంగుబాటులు తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానానికి విజయంగా భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 2025 అక్టోబర్ 21న మావోయిస్టు కేడర్‌ను హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పిలుపు తర్వాత అంతర్గత విభేదాలు, సిద్ధాంతపరమైన భిన్నాభిప్రాయాలు, గ్రౌండ్ రియాలిటీకి పార్టీ భావజాలానికి మధ్య ఏర్పడిన అంతరం వంటి అంశాలు ఉద్యమ ఐక్యతను దెబ్బతీసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ పోలీస్1993లో ప్రారంభించిన ‘సరెండర్ అండ్ పునరావాస పథకం’ ఇప్పటికీ సమర్థంగా అమలవుతోందని అధికారులు తెలిపారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 5,865 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు సమాచారం.
2025 సంవత్సరంలో మాత్రమే 544 మంది అజ్ఞాత మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారని, వీరిలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. లొంగిపోయిన వారికి భూమి, నగదు ప్రోత్సాహకాలు, విద్యా సహాయం వంటి పునరావాస సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. క్రిమినల్ కేసుల విషయంలో సానుకూలంగా పరిశీలిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ లొంగుబాటు ఘటనను పోలీసులు, కేంద్ర ప్రభుత్వ సమగ్ర వ్యూహంలో భాగంగా చూస్తున్నారు. సాయుధ పోరాటాన్ని విడిచిపెట్టి సమాజంలో సాధారణ జీవితాన్ని ఎంచుకోవాలని మావోయిస్టు కేడర్‌కు అధికారులు మరోసారి పిలుపునిచ్చారు. అగ్రనేతల లొంగుబాటుతో తెలంగాణలో మావోయిస్ట్ ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, ఇది భద్రతా దళాల నైతిక విజయం అని ప్రభుత్వం పేర్కొంది.
