Let's talk: editor@tmv.in
దేవుని ప్రసాదం కల్తీ వెనుక పెద్ద సిండికేట్ హస్తముంది: సీఎం

దేవుని ప్రసాదం కల్తీ వెనుక పెద్ద సిండికేట్ హస్తముంది: సీఎం

Panthagani Anusha
25 ఫిబ్రవరి, 2026

ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రతను, కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ విధంగా కాలరాసిందో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధారాలతో సహా బయటపెట్టారు. మంగళవారం శాసనసభలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై జరిగిన లఘు చర్చలో ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చారు. 2019 నుంచి 2024 మధ్య జరిగిన అపవిత్ర పాలనలో ఏకంగా 59.71 లక్షల కిలోల కల్తీ నెయ్యిని లడ్డూల తయారీకి వాడారని దీనివల్ల దాదాపు 20 కోట్లకు పైగా లడ్డూలు అపవిత్రమయ్యాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవస్థీకృత సిండికేట్.. రూ.234 కోట్ల కుంభకోణం!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో గత ఐదేళ్లుగా ఒక వ్యవస్థీకృత సిండికేట్ పనిచేసిందని సీఎం ధ్వజమెత్తారు. కేవలం కల్తీ నెయ్యి కొనుగోలు కోసమే భక్తుల సొమ్ము రూ. 234.51 కోట్లు వెచ్చించారని పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సభకు వివరించారు. 2020 జనవరి-ఫిబ్రవరి మాసాల్లో టెండర్ నిబంధనలను కావాలనే మార్చి నాణ్యత ప్రమాణాలను నీరుగార్చారని ఆరోపించారు. 2022లో సీఎఫ్టీఆర్ఐ ల్యాబ్ నివేదికలో ‘బీటా సిటోస్టెరాల్’ వంటి కల్తీలు ఉన్నట్లు తెలిసిన అప్పటి టీటీడీ బోర్డు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ల్యాబ్‌లను తప్పుదారి పట్టించి నకిలీ ధృవీకరణ పత్రాలతో టెండర్లు దక్కించుకున్నారని స్పష్టం చేశారు.

జంతు కొవ్వు ఆనవాళ్లు

2024 జూలై 23న ఎన్‌డీడీబీ నివేదికలో నెయ్యిలో జంతు కొవ్వు ఆనవాళ్లు ఉన్నట్లు తేలడం అత్యంత దురదృష్టకరమని సీఎం పేర్కొన్నారు. మోనో గ్లిసరైట్, ఎసిటిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలను వాడి నెయ్యిని కల్తీ చేసినట్లు ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయన్నారు. ఈ వ్యవహారంలో పీఏ చిన్నప్పన్న రూ.4.5 కోట్ల మేర లంచం తీసుకున్నట్లు సిట్ దర్యాప్తులో బయటపడిందని వెల్లడించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో విచారణ జరుగుతోందని, తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీబీఐ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని తెలిపారు.

దేవాలయాలపై దాడులు.. పవిత్రత పునరుద్ధరణ

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 2032 దేవాలయాలపై దాడులు జరిగాయని రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం, అంతర్వేది రథం దహనం వంటి ఘటనలపై అప్పట్లో సరైన విచారణ జరగలేదని చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే టీటీడీలో ప్రక్షాళన చేపట్టామని ఇప్పుడు వాడుతున్న ప్రతి వస్తువును ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారుల తనిఖీ తర్వాతే అనుమతిస్తున్నామని చెప్పారు. శ్రీవారి లడ్డూ నాణ్యతను పెంచామని అన్నప్రసాద వడ్డనలో పాత విధానాన్ని పునరుద్ధరించామని ప్రస్తుతం 98 శాతం మంది భక్తులు సంతృప్తిగా ఉన్నారని ఆయన ప్రకటించారు.

దోషులకు శిక్ష పడాల్సిందే: పవన్ కళ్యాణ్

ఈ చర్చలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత పాలనలో సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయిందని ఇది హిందూ సమాజం క్షమించరాని అపరాధమని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని భక్తుల భావోద్వేగాలతో ఆడుకున్న వారికి కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు. “హిందూ ధర్మ పరిరక్షణకు మా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది అపచారాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టి బోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.