
దేవుడితో వైసీపీ నీచ రాజకీయం: ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రతను మంటగలుపుతూ వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయాలపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిప్పులు చెరిగారు. శాసనమండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి ఫొటోలు పట్టుకుని కాళ్లకు చెప్పులు, షూలు వేసుకుని నినాదాలు చేయడం వైసీపీ దిగిరారుతనానికీ పరాకాష్ట అని ఇదంతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్న కుట్ర అని ఆయన ధ్వజమెత్తారు.
జగన్ రెడ్డికి గానీ ఆయన పార్టీ నేతలకు గానీ దేవుడంటే భక్తి లేదని హిందువుల మనోభావాలంటే అసలు లెక్కే లేదని గోరంట్ల విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు చట్టసభలను బూతులు, వెకిలిచేష్టలకు కేంద్రాలుగా మార్చిన వారు, ఇప్పుడు ఏకంగా దేవుడి ఫొటోలతో దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయాలు, హిందూ ధర్మంపై జగన్‌కు మొదటి నుంచి చిన్నచూపు ఉందని అందుకే పరమ పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని జంతు కొవ్వు, రసాయనాలతో కల్తీ చేసే సాహసం చేశారని గోరంట్ల ఆరోపించారు. గత ఐదేళ్లలో టీటీడీని వైసీపీ నేతలు దోపిడీ కేంద్రంగా మార్చుకున్నారని పరకామణిలో విదేశీ కరెన్సీ కొల్లగొట్టిన కేసులో నిందితుడైన రవికుమార్‌తో రాజీ పడి అతని ఆస్తులను టీటీడీకి రాయించి దొంగలకు జగన్ పెద్దన్నలా నిలిచారని విమర్శించారు. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, సేవా టిక్కెట్లు, ప్రసాదాలను అమ్ముకుని కోట్లు దండుకున్నారని సుమారు రూ.2 కోట్ల విలువైన తలనీలాలను అక్రమంగా చైనాకు తరలిస్తుండగా అస్సాం రైఫిల్స్ పట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు.
తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరగడం ద్వారా జగన్ తన అహంకారాన్ని చాటుకున్నారని శ్రీవారి ఆలయంలో గోవింద నామం తప్ప మరోటి వినిపించకూడదన్న నియమాన్ని తుంగలో తొక్కి, తన పిన్నితో 'జగన్ రెడ్డి రక్షక గోవింద' అని పొగిడించుకుని స్వామివారిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాముడి విగ్రహాల శిరస్సు ఖండన వంటి వందలాది దాడులు జరిగినా ఒక్కరోజైనా జగన్ ఆయా ప్రాంతాలను సందర్శించి హిందువులకు భరోసా ఇవ్వలేదని వాపోయారు. బ్రహ్మోత్సవాల సమయంలో సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలన్న సంప్రదాయాన్ని వ ఒక్క సారి కూడా పాటించలేదని పేర్కొన్నారు.
అదేవిదంగా దేవాలయాల భూములు, మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులపై ఉన్న శ్రద్ధ జగన్‌కు ఆలయాల పరిరక్షణపై లేదని రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులను ప్రోత్సహించి 2500 ఆలయ ట్రస్టులను నిర్వీర్యం చేసిన పాపం ఆయనదేనని గోరంట్ల పేర్కొన్నారు. దేవుడితో ఆటలు ఆడినందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారని అయినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకుని దేవుడికి క్షమాపణలు చెప్పుకోకపోతే భవిష్యత్తులో ఆ 11 సీట్లు కూడా రావడం కష్టమని ఆయన హెచ్చరించారు.
