

దేవాదాయ శాఖలో 191 మందికి నియామక పత్రాలు అందజేసిన మంత్రి కొండా సురేఖ
70 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో దేవాదాయ శాఖలో భారీగా ఉద్యోగుల నియామకం చేపట్టి సరికొత్త శకానికి నాంది పలికారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా జరిగిన ఓ చారిత్రాత్మక కార్యక్రమంలో 191 మంది మతపరమైన ఉద్యోగులకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నియామక ఉత్తర్వులను అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పారదర్శక పనితీరుకు, దేవాదాయ శాఖ సమిష్టి కృషికి ఈ నియామకాలే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 47 ప్రముఖ ఆలయాలకు ఎంపికైన పురోహితులు, పరిచారకులు, వేదపండితులు, అసిస్టెంట్ కుక్ లు, వాహన పూజ పురోహితులు, డోలు, సన్నాయి, మృదంగం, శృతి, తాళం వంటి వాయిద్య విభాగాల ఉద్యోగులు ఈ నియామక పత్రాలను అందుకున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కల సాకారం కావడంతో నియామక ఉత్తర్వులు అందుకున్న పలువురు ఉద్యోగులు వేదికపైనే ఉద్వేగానికి, భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం మంత్రి సురేఖని దేవాదాయ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, దేవాలయం అనేది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు వైదిక విజ్ఞానానికి కేంద్రమని కొనియాడారు. దేవాలయ ఉద్యోగమనేది కేవలం ఒక ఉపాధి లేదా ఉద్యోగం కాదు. అది భగవంతుని సేవ చేసే అరుదైన అవకాశం, పవిత్రమైన బాధ్యత. భక్తసేవే భగవత్సేవ అనే భావనతో భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించడమే కొత్త ఉద్యోగుల లక్ష్యం కావాలని మంత్రి సూచించారు. నిరంతరం దేవుని సేవలో తరించే ఉద్యోగుల కోసం ’అర్చకులు ఇతర ఉద్యోగుల సంక్షేమ నిధి ట్రస్ట్’ ద్వారా అందుతున్న ప్రయోజనాలను ప్రభుత్వం భారీగా పెంచి అందిస్తోందని ఆమె వెల్లడించారు.
దేవాదాయ శాఖ భవిష్యత్తు ప్రణాళికలు
రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవాన్ని పెంపొందించేందుకు, సిబ్బందిని ప్రోత్సహించేందుకు మంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రవ్యాప్త ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, పురాణ ప్రవచనాల నిర్వహణకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. దేవాలయాల అన్ని విభాగాల ఉద్యోగుల పనితీరును బట్టి, వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక అవార్డులను ప్రదానం చేస్తారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఈవోల ప్రమోషన్లను విజయవంతంగా పూర్తి చేశామని, త్వరలోనే గ్రేడ్ 3 ఈవోల ప్రమోషన్లను కూడా చేపడతామని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో త్వరలోనే 'వరుణయాగాలు' నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ యాగాల ద్వారా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలంతా సుభిక్షంగా ఉండేలా పూజలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సరస్వతి నది పుష్కరాలను వైభవంగా నిర్వహించిందని, రాబోయే రోజుల్లో గోదావరి, కృష్ణా నదీ పుష్కరాలను మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి కొండా సురేఖ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ హనుమంతరావు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
