
దేవరాజ్ ఉర్స్ రికార్డు ప్రజల ఆశీర్వాదాలతో బద్దలు కొడతాం: సీఎం సిద్ధరామయ్య
ప్రజల ఆశీర్వాదాలు ఉంటే మాజీ ముఖ్యమంత్రి దేవరాజ్ ఉర్స్ రికార్డును తప్పకుండా బద్దలు కొడతామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో రికార్డులు కాలానుగుణంగా మారుతాయని, అవి బ్రేక్ చేయడానికే ఉన్నాయని ఆయన అన్నారు. సోమవారం మైసూరులో మీడియాతో సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. దేవరాజ్ ఉర్స్ మైసూరు జిల్లాకు చెందినవారని, తాను కూడా అదే జిల్లాకు చెందినవాడినని గుర్తు చేశారు. ప్రజల ఆశీర్వాదాలతో ఆయన రికార్డు బ్రేక్ అవుతుంది. నన్ను నాతోనే పోల్చుకోవాలి. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. పరిస్థితులే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయని వ్యాఖ్యానించారు. 1983 అసెంబ్లీ ఎన్నికలను గుర్తు చేసుకున్న సీఎం, అప్పట్లో ప్రజలు తనకు డబ్బు, ఓట్ల రూపంలో మద్దతిచ్చారని చెప్పారు. దేవరాజ్ ఉర్స్ వేరు రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. అలాగే భవిష్యత్తులో మరొకరు వచ్చి నాకంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉండవచ్చు, ఎక్కువ బడ్జెట్లు ప్రవేశపెట్టవచ్చు అని సిద్ధరామయ్య అన్నారు.
కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశంపై స్పందిస్తూ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో ఈ విషయం చర్చిస్తానన్నారు. జనవరిలో మాట్లాడతానని ఆయన చెప్పారు. పిలిస్తే నేను వెళ్తాను అని సీఎం చెప్పారు. బీజేపీ బళ్లారి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరడంపై స్పందిస్తూ, ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ముందుగా నివేదిక రానివ్వాలి. ఆ తర్వాత ఎలాంటి విచారణ అవసరమో నిర్ణయిస్తామని తెలిపారు.
కేంద్రం గ్రామస్థాయి పాలనను బలహీన పరుస్తోంది
వీబీ–జీ రాం–జీ గ్యారంటీపై విమర్శలకు సమాధానంగా ఇక్కడ రామ్ అంటే రాముడు కాదని వ్యాఖ్యానించారు. ఎంఎన్ రేగాలో మార్పులు అవసరం లేదని స్పష్టం చేశారు. రూ.3,000 కోట్లలో 40 శాతం భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. వీబీ–జీ రాం–జీ చట్టం ద్వారా గ్రామ స్థాయి పాలనను బలహీనపరిచి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉపాధి హక్కు, సమాచార హక్కు, విద్య హక్కు వంటి చారిత్రాత్మక చట్టాల ద్వారా ప్రజలను శక్తివంతం చేసిందని గుర్తు చేశారు. డిసెంబర్ 17న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ కొత్త చట్టాన్ని మరుసటి రోజే ఎటువంటి సమగ్ర చర్చ లేకుండా ఆమోదించారని విమర్శించారు. దేశవ్యాప్తంగా సుమారు 12.16 కోట్ల మంది ఎన్ రేగా పై ఆధారపడి జీవిస్తున్నారని, వారిలో 6.21 కోట్ల మంది మహిళలు, 17 శాతం ఎస్సీలు, 11 శాతం ఎస్టీలు ఉన్నారని తెలిపారు. కర్ణాటకలోనే 71.18 లక్షల మంది ఎన్ రేగా కార్మికులు ఉన్నారని, వారిలో 36.75 లక్షల మంది మహిళలు (51.6 శాతం) ఉన్నారని వెల్లడించారు. ప్రజాపక్ష చట్టాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు. మునుపటి చట్టం కింద గ్రామాల్లోనే ఉపాధి హామీ ఉండేదని, కనీసం ఏడాదికి 100 రోజులు పని కోరే చట్టబద్ధమైన హక్కు ఉండేదని, ఇప్పుడు ఆ హామీలు తొలగించారని ఆయన అన్నారు.
మానవులు–వన్యప్రాణుల మధ్య సంఘర్షణ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మైసూరు పరిసరాల్లో పులుల సంఖ్య పెరగడంతో అవి అటవీ ప్రాంతాల నుంచి బయటకు వస్తున్నాయని చెప్పారు. ఈ రోజు విమానాశ్రయ పరిసరాల్లో కూడా ఒక పులి కనిపించింది. వెంటనే పట్టుకుని ఇతర అటవీ ప్రాంతాల్లో వదిలేయాలని అధికారులను ఆదేశించాను. ఆపరేషన్ ప్రారంభమైందని తెలిపారు. మైసూరులో హీలియం గ్యాస్ పేలుడు ఘటనలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రతిపాదిత పరికరాల సదస్సుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కృష్ణ భైరేగౌడ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.
సామాజిక న్యాయానికి బాట వేసిన నేత: కర్ణాటక మాజీ సీఎం దేవరాజ్ ఉర్స్
కర్ణాటక రాజకీయ చరిత్రలో సామాజిక న్యాయానికి పునాదులు వేసిన ప్రముఖ నేతగా మాజీ ముఖ్యమంత్రి డీ. దేవరాజ్ ఉర్స్ చిరస్థాయిగా నిలిచిపోయారు. భూ సంస్కరణలు, రాజకీయంగా వెనుకబడిన తరగతుల బలోపేతం, గ్రామీణ పేదల సంక్షేమం వంటి అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయ దిశను పూర్తిగా మార్చాయి.
1915 ఆగస్టు 20న మైసూరు జిల్లాలో జన్మించిన దేవరాజ్ ఉర్స్, కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర స్థాయిలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఒకప్పుడు రాజవంశ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందినవారైనా, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన అరుదైన నాయకుడిగా గుర్తింపు పొందారు. దేవరాజ్ ఉర్స్ తొలిసారి 1969 నుంచి 1971 వరకు, అనంతరం 1972 నుంచి 1977 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మొత్తం సుమారు ఎనిమిదేళ్ల పాటు సీఎంగా కొనసాగడం అప్పటి కర్ణాటక రాజకీయాల్లో రికార్డుగా నిలిచింది.
భూసంస్కరణలతో గ్రామీణ విప్లవం
ఉర్స్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమలైన భూసంస్కరణ చట్టాలు రాష్ట్రంలో పెను మార్పులకు దారి తీశాయి. భూమిలేని రైతులు, వ్యవసాయ కూలీలకు భూమి పంపిణీ చేయగా, జమీందారీ వ్యవస్థ ప్రభావం తగ్గింది. దీని ద్వారా గ్రామీణ శక్తి సమీకరణ పూర్తిగా మారింది. దేవరాజ్ ఉర్స్ పాలనలో ఓబీసీలు, దళితులు, గిరిజనులు ప్రభుత్వ వ్యవస్థలో కీలక స్థానం పొందారు. మంత్రివర్గం, పరిపాలనలో వారికి ప్రాధాన్యం కల్పించడం ద్వారా కర్ణాటక రాజకీయాల్లో ‘సామాజిక న్యాయం’ అనే భావనను బలంగా నాటారు. వెనుకబడిన తరగతుల గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన కమిషన్లు భవిష్యత్తులో రిజర్వేషన్ విధానాలకు బలమైన పునాదిగా మారాయి. ఈ విధానాలే తరువాతి కాలంలో జాతీయ స్థాయిలో మండల్ రాజకీయాలకు మార్గదర్శకంగా నిలిచాయి. గ్రామీణ, పేద వర్గాలకు విద్య అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విస్తరణకు ఉర్స్ పెద్దపీట వేశారు. విద్య ద్వారా సామాజిక మార్పు సాధ్యమని ఆయన నమ్మకం.
ఇందిరా గాంధీతో సన్నిహిత సంబంధం
1969లో కాంగ్రెస్ విభజన సమయంలో ప్రధాని ఇందిరా గాంధీకి దేవరాజ్ ఉర్స్ గట్టి మద్దతుగా నిలిచారు. ఇందిరా గాంధీ సామాజిక న్యాయ విధానాలను కర్ణాటకలో అమలు చేసిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. భూ సంస్కరణలు, రిజర్వేషన్ విధానాల కారణంగా ఉన్నత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పార్టీ లోపల కూడా విభేదాలు తలెత్తినా, ఉర్స్ తన విధానాల నుంచి వెనక్కి తగ్గలేదు. 1982 ఆగస్టు 6న దేవరాజ్ ఉర్స్ మరణించినప్పటికీ, ఆయన ఆలోచనలు ఇప్పటికీ కర్ణాటక రాజకీయాల్లో ఉన్నాయి.
