Let's talk: editor@tmv.in
దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్‌ కలకలం

దేవరపల్లి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్‌ కలకలం

Panthagani Anusha
9 ఫిబ్రవరి, 2026

పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో శనివారం చోటుచేసుకున్న ఫుడ్ పాయిజనింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. హాస్టల్‌లో భోజనం చేసిన 70 మందికిపైగా గిరిజన విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల పరిస్థితి విషమించడంతో వారిని అత్యవసరంగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రితో పాటు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

శనివారం హాస్టల్‌లో సగం ఉడికించిన ఇడ్లీ, సాంబారు వడ్డించినట్లు అధికారులు గుర్తించారు. కాగా తిన్న కొద్దిసేపటికే విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు బయటపడడంతో సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కొందరు విద్యార్థులు స్పృహ కోల్పోయినట్లు సమాచారం.

సంఘటనపై సమాచారం అందిన వెంటనే రంపచోడవరం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.స్మరణ రాజ్, స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. చికిత్సపై వైద్యులతో సమీక్ష నిర్వహించి, అవసరమైన మందులు వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

పోలవరం జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్, అల్లూరి సీతారామ రాజు జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ ఘటనపై స్పందిస్తూ ఇది ఫుడ్ పాయిజనింగ్ ఘటనగా ప్రాథమికంగా అనుమానిస్తున్నామని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులంతా ప్రస్తుతం ప్రమాదం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. మరోవైపు ఘటనకు కారణమైన అంశాలపై సమగ్ర విచారణ చేపట్టామని నీరు, ఆహార నమూనాలను ల్యాబ్ పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పోలవరం జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన అవసరమైతే ప్రత్యేక వైద్య నిపుణుల బృందాన్ని రంపచోడవరానికి పంపాలని ఆదేశించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో భోజన నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.