
దేవభూమిలో సీఎం పీఠం అధిష్టించెదెవరు?
కేరళలో ఏప్రిల్ 9న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. చాలా కాలంగా రెండు ప్రధాన కూటముల మధ్యే సాగిన ఎన్నికల పోరు ఈసారి మరింత ఆసక్తికరంగా మారింది. అధికార వామపక్ష కూటమి ఎల్‌డీఎఫ్ వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) పదేళ్ల తరువాత మళ్లీ అధికారంలోకి రావాలని కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూడా కేరళలో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
పినరయి విజయన్ ఎల్‌డీఎఫ్‌కు ప్రధాన బలం
ఎల్‌డీఎఫ్ ఎన్నికల ప్రచారానికి కేంద్రబిందువుగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నిలుస్తున్నారు. 81 ఏళ్ల వయసున్న విజయన్ మరోసారి తన బలమైన స్థావరమైన ధర్మదాంనియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముంది. సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొనే నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. తన రెండో పర్యాయ పాలనలో ‘విజన్ 2031’ ప్రణాళికను అమలు చేస్తూ కేరళను జ్ఞానాధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పదేళ్లుగా అధికారంలో ఉండటం వల్ల వ్యతిరేకత (ఆంటీ ఇన్‌కంబెన్సీ) కూడా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.
శైలజకు కీలక పోరు
సీనియర్ సీపీఎం నేత కేకే.శైలజ కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. నిపా వైరస్, కోవిడ్ మహమ్మారి సమయంలో సమర్థంగా పనిచేసి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆమెను ఈసారి సవాలుతో కూడిన పెరవూర్ నియోజకవర్గం నుంచి పోటీలో నిలిచారు. అక్కడ ఆమెకు సన్నీజోసెఫ్ నేతృత్వంలోని కాంగ్రెస్ బలమైన సవాల్ విసరనుంది.
ఎల్‌డీఎఫ్ కూటమి వ్యూహం
ఎల్‌డీఎఫ్ కూటమిలోని ఇతర పార్టీల మద్దతు కూడా కీలకంగా మారనుంది. వాటిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కేరళ కాంగ్రెస్(ఎం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ సెక్యూలర్ వంటి పార్టీలు ఉన్నాయి.
జోష్ కే.మణి నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ (ఎం) పార్టీ మధ్య కేరళలోని క్రైస్తవ ఓటర్లలో ప్రభావం చూపే అవకాశముంది. అయితే ఆయన తన తండ్రి కేఎం.మణి బలమైన స్థావరంగా నిలిచిన పాలా నియోజకవర్గంలో పోటీపై కొంత సందేహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
యూడీఎఫ్‌కు ‘జీవన్మరణ పోరు’
కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పెరవూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముంది. యూడీఎఫ్ అధికారంలోకి రాకపోతే రాజకీయాలను తాను విరమించుకుంటానని కూడా ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రమేశ్ చెన్నితల కూడా కూటమిలో అనుభవజ్ఞుడైన నాయకుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి ఉమెన్‌చాందీ కుమారుడు చాందీ ఉమెన్ యువ నాయకుడిగా యూడీఎఫ్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఇటీవల పుతుప్పల్లి ఉపఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచి యువ ఓటర్లను ఆకర్షించారు. యూడీఎఫ్ కూటమిలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ నేత పీకే. కున్‌హలికుట్టి యూడీఎఫ్‌లో ప్రధాన వ్యూహకర్తగా ఉన్నారు. అదే సమయంలో కేకే.రేమా కూడా ముఖ్య నాయకురాలిగా నిలుస్తున్నారు. ఆమె భర్త, ఆర్‌ఎంపీ నేత టీపీ. చంద్రశేఖరన్ హత్య అనంతరం రాజకీయ హింసకు వ్యతిరేకంగా పోరాటానికి ప్రతీకగా నిలిచారు.
బీజేపీ ‘కొత్త కేరళ’ నినాదం
కేరళలో రాజకీయంగా ఎదగాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ నేతృత్వంలో పార్టీ అభివృద్ధి అజెండాతో ప్రచారం ప్రారంభించింది. ఆయన నేమమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముంది. ఈ స్థానం గతంలో బీజేపీ గెలిచిన సీటుగా ఉండటంతో పార్టీ మళ్లీ దానిని చేజిక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర మాజీ మంత్రి వీ.మురళీధరన్‌ను కజకుట్టం నుంచి, మాజీ డీజీపీ ఆర్.శ్రీలేఖను వట్టియూర్‌కవు నుంచి పోటీకి దించే అవకాశముంది. అదే సమయంలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే ఎస్.రాజేంద్రన్ ఇటీవల బీజేపీలో చేరడం పార్టీకి మరింత బలం చేకూర్చింది. అలాగే ఫైర్‌బ్రాండ్ నేత శోభా సురేంద్రన్ కూడా బీజేపీకి ముఖ్య ప్రచారకర్తగా నిలుస్తున్నారు. అలాగే ఈసారి కేరళలో కీలక విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ప్రత్యేకంగా తిరువనంతపురం నగర కార్పొరేషన్‌లో సాధించిన విజయం పార్టీకి ధైర్యాన్నిచ్చింది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక రాజకీయాలను చెరిపేయడం బీజేపీకి పెద్ద సవాలుగా మారింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎల్‌డీఎఫ్ కన్వీనర్ టీపీ. రామకృష్ణన్ సీట్ల పంపకాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ప్రతిపక్ష నేత వీడీ.సతీశన్ మాత్రం యూడీఎఫ్ 100కి పైగా స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కేరళ ప్రజలు ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ పాలనలతో విసిగిపోయారని, ఈసారి మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
సీపీఎం 81 మంది అభ్యర్థుల జాబితా విడుదల
అధికార వామపక్ష కూటమిలో కీలక పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఎం) 81 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ.గోవిందన్ ఈ జాబితాను విడుదల చేశారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మరోసారి తన ప్రస్తుత నియోజకవర్గమైన ధర్మదం నుంచి పోటీ చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గంలోని మరో 10 మంది మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. మాజీ ఆరోగ్యమంత్రి కేకే.శైలజను కన్నూర్ జిల్లాలోని పెరవూర్ నియోజకవర్గం నుంచి పోటీకి దించారు. మొత్తం జాబితాలో ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులను కూడా పార్టీ మద్దతుతో నిలబెట్టింది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా ఎల్‌డీఎఫ్ వ్యూహాలు రచిస్తోంది.
సీపీఐ 25 స్థానాలకు అభ్యర్థులు ప్రకటన
వామపక్ష కూటమిలో మరో కీలక భాగస్వామి అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) కూడా 25 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం ఈ జాబితాను వెల్లడించారు. పార్టీ తరఫున ప్రస్తుత మంత్రులు జీ.ఆర్ అనిల్, జే.చించురాణి, కే.రాజన్, పి.ప్రసాద్, ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అలాగే రెండు సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతలు ముహమ్మద్ ముహ్సిన్, ఈటీ. టైసన్, వీ.ఆర్. సునీల్‌కుమార్‌లకు కూడా టికెట్లు ఇచ్చారు. నార్త్ పరవూర్ నియోజకవర్గంలో ఈసారి ఆసక్తికర పోరు నెలకొననుంది. అక్కడ సీపీఐ అభ్యర్థి ఈటి టైసన్‌కు ప్రతిపక్ష నేత వీడీ. సతీశన్ పోటీగా నిలవనున్నారు.
ఎన్నికల సమరానికి సిద్ధమైన పార్టీలు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ప్రధాన రాజకీయ పార్టీలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎల్‌డీఎఫ్ కన్వీనర్ టీపీ. రామకృష్ణన్ మాట్లాడుతూ కూటమిలో సీట్ల పంచాయితీ దాదాపు పూర్తయ్యిందని చెప్పారు. ప్రతిపక్ష యూడీఎఫ్ తరఫున ప్రతిపక్ష నేత వీడీ.సతీశన్ మాట్లాడుతూ 100కు పైగా స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన విజయాలు తమకు అనుకూల సంకేతాలని అన్నారు. ఇక ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సాదిక్ అలీ షాహిబ్ తంగల్ కూడా త్వరలో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.
ఏప్రిల్ 9న పోలింగ్
కేరళ అసెంబ్లీకి మొత్తం 140 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నింటికీ ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రధానంగా ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్, ఎన్డీఏ మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కేరళలో ఎన్నికల సమరం అధికారికంగా ప్రారంభమైంది. వచ్చే కొన్ని వారాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించనున్నాయి.
