
దూరదర్శన్, ఎఐఆర్‌లో ప్రచారం చేసుకోండి: ఈసీఐ
రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు ఉచిత ప్రసార, టెలికాస్ట్ సౌకర్యం కల్పిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దూరదర్శన్, ఆల్‌ఇండియా రేడియో (ఎఐఆర్)లో ఉచిత ప్రసార సమయం కోసం డిజిటల్ ఓచర్లను కేటాయించినట్లు ఈసీఐ సోమవారం వెల్లడించింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ చర్యను ప్రజాప్రతినిధుల చట్టం-1951లోని సెక్షన్ 39ఏ ప్రకారం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈసీఐ ప్రకారం, ప్రత్యేక ఐటీ ప్లాట్‌ఫామ్ ద్వారా గుర్తింపు పొందిన అన్ని జాతీయ, రాష్ట్ర పార్టీలకు డిజిటల్ టైమ్ ఓచర్లు జారీ చేశారు.
పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు, అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన తేదీ నుంచి ఈ ప్రసార కాలం అమల్లో ఉంటుంది. ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో లాటరీ విధానం ద్వారా ప్రసార సమయాన్ని కేటాయిస్తారు. ఈ ప్రక్రియను పార్టీ ప్రతినిధులు, రాష్ట్ర ఎన్నికల అధికారుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహిస్తారు. ప్రతి పార్టీకి ప్రాథమికంగా 45 నిమిషాల ఉచిత ప్రసార సమయం దూరదర్శన్, ఆల్‌ఇండియా రేడియోలో కేటాయిస్తారు. ఈ సమయాన్ని ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ ఛానళ్లలో సమానంగా విభజిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల ప్రదర్శన ఆధారంగా అదనపు ప్రసార సమయాన్ని కూడా ఇవ్వనున్నట్లు ఈసీఐ తెలిపింది. దీంతో బలమైన రాజకీయ పునాది ఉన్న పార్టీలకు అదనపు ప్రయోజనం లభిస్తుంది. ప్రసారానికి ముందుగా పార్టీలు తమ ప్రసంగాల స్క్రిప్ట్‌లు, రికార్డింగ్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఇవి సాంకేతిక, నియంత్రణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని ఈసీఐ స్పష్టం చేసింది. రికార్డింగ్స్‌ను ప్రసార్ భారతీ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం స్టూడియోల్లో లేదా దూరదర్శన్/ఎఐఆర్ కేంద్రాల్లో చేయవచ్చు. ఇక వ్యక్తిగత ప్రసారాలకే కాకుండా, ప్రసార్ భారతి ఆధ్వర్యంలో ప్యానెల్ చర్చలు, డిబేట్లు కూడా నిర్వహించనున్నారు. ప్రతి అర్హత గల పార్టీ ఒక ప్రతినిధిని నామినేట్ చేయవచ్చు.
ఇంతకుముందు ఈసీఐ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. కేరళ, అస్సాంలో ఏప్రిల్ 9న ఒకే దశలో ఓటింగ్ నిర్వహిస్తారు. తమిళనాడులో ఏప్రిల్ 23న, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు, పుదుచ్చేరి ఫలితాలు మే 4న వెల్లడించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 9న ప్రభుత్వ సెలవు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 9న ప్రభుత్వ సెలవు ప్రకటిస్తూ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. పుదుచ్చేరి ప్రభుత్వ హోం శాఖ సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, యూనియన్ టెర్రిటరీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థలు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుంది. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా, వివిధ ప్రభుత్వ శాఖల్లో రోజువారీ వేతనంపై పనిచేస్తున్న కార్మికులకు కూడా ఏప్రిల్ 9ను చెల్లింపు సెలవుగా ప్రకటించారు. పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అందులో పుదుచ్చేరి ప్రాంతంలో 23 స్థానాలు, కరైకల్‌లో 5 స్థానాలు ఉండగా, మహే, యానాం ప్రాంతాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు.
