Let's talk: editor@tmv.in
దుర్గాపూర్ ఘటన బాధాకరం: కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవి

దుర్గాపూర్ ఘటన బాధాకరం: కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవి

Pinjari Chand
13 అక్టోబర్, 2025

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఒడిశాకు చెందిన మెడికల్ విద్యార్థినిపై జరిగిన దారుణమైన అత్యాచార ఘటనను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆదివారం ఆమె మాట్లాడుతూ జాతీయ మహిళా కమిషన్ బృందం అక్కడికి వెళ్లి సమాచారం సేకరిస్తోందని, వారు బాధిత విద్యార్థిని, కాలేజీ యాజమాన్యాన్ని, పోలీసులను, తదితరులను కలిసి వివరాలు సేకరిస్తోందని తెలిపారు. ఆ నివేదిక వచ్చిన తరువాత కేంద్రం తరఫున తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక యువతిపై ఇంత దారుణమైన ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమైనదని, విద్యా సంస్థల్లో కూడా అమ్మాయిలకు భద్రత లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భద్రత విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు.

అలాగే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి, ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు పదేపదే జరగడం చాలా విచారకరం. మమతా బెనర్జీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా కాలేజీల్లో భద్రతా ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా, సీసీ టీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అనే విషయాలను కూడా ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ మహిళా కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మహిళల భద్రతను కేవలం నినాదాలుగా కాకుండా, వ్యవస్థాతగతంగా బలోపేతం చేయాలని, ఈ కేసులో బాధితురాలికి పూర్తి న్యాయం జరిగే వరకు మేం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.

దుర్గాపూర్ ఘటన బాధాకరం: కేంద్రమంత్రి అన్నపూర్ణ దేవి - Tholi Paluku