
దుర్గాపూర్ కేసులో మరో నిందితుడి అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుర్గాపూర్ మెడికల్ విద్యార్థిని అత్యాచారం కేసులో పోలీసులు అనుమానితులను వేగంగా అరెస్ట్ చేస్తున్నారు. కేసు దర్యాప్తులో పురోగతి సాధిస్తున్నారు. ఆదివారం ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరు పరిచారు. వారిని కోర్టు 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. సోమవారం మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఆసన్ సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది.
ఒడిశా రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శోవనా మోహంతీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం త్వరలోనే దుర్గాపూర్ లో పర్యటిస్తామని, బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని పరామర్శిస్తామన్నారు. ఈ బృందం బాధితురాలి ఆరోగ్య స్థితి, వైద్య చికిత్స, దర్యాప్తు పురోగతిపై సమీక్షించి తమ నివేదికను ఒడిశా ప్రభుత్వానికి సమర్పించనుంది. మోహంతీ మాట్లాడుతూ బాధితురాలి ఆరోగ్యం, మానసిక పరిస్థితి, అలాగే బెంగాల్ ప్రభుత్వం వైపు నుంచి అందుతున్న వైద్య సదుపాయాల గురించి తెలుసుకుంటాం. దర్యాప్తు సక్రమంగా జరుగుతోందా? లేదా అన్నది కూడా పరిశీలిస్తాం. కేసు త్వరితగతిన విచారణకు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మేం ఆమెకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని, అవసరమైతే బెంగాల్ పోలీస్ అధికారులను కూడా కలుస్తామని ఒడిశా మహిళా కమిషన్ సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బిజియాని సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరూ చట్టాల కంటే పైన ఉండరని అన్నారు. శుక్రవారం రాత్రి పశ్చిమ బెంగాల్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన రెండవ సంవత్సరం చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థిని పై ఈ దారుణ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
నిందితులను కఠినంగా శిక్షించండి:బాధితురాలి తండ్రి
దుర్గాపూర్ గ్యాంగ్‌రేప్ ఘటనలో బాధితురాలి తండ్రి సోమవారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.నిందితులకు చట్ట ప్రకారం అత్యంత కఠినమైన శిక్ష విధించాలని ఆయన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అమ్మాయిలు భద్రంగా ఉన్నారని అనిపించాలంటే నిందితులపై కఠిన చర్యలు తప్పనిసరి అని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని, కానీ ఒడిశా మహిళా కమిషన్ నుంచి మాత్రం నాకు ఫోన్ వచ్చిందని తెలిపారు. సీఎం మమతా బెనర్జీ నా ఈ బాధను అర్థం చేసుకోవాలని కోరారు. నా కూతురు కోలుకుంటోంది. పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. బెంగాల్ ప్రభుత్వం ఈ కేసులో నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష విధిస్తేనే రాష్ట్రంలోని అమ్మాయిలకు భద్రతపై నమ్మకం పెరుగుతుంది అని బాధితురాలి తండ్రి అన్నారు.
