Let's talk: editor@tmv.in
దుర్గాపూజ ఉత్సవాల్లో కోల్‌కతా పోలీసుల గట్టి పహారా

దుర్గాపూజ ఉత్సవాల్లో కోల్‌కతా పోలీసుల గట్టి పహారా

Panthagani Anusha
5 అక్టోబర్, 2025

తూర్పు భారతదేశంలో దుర్గాపూజ అనగానే మొదట గుర్తొచ్చేది కోల్‌కతా నగరం. ప్రతి వీధి దీపాలతో వెలిగిపోతూ జనం సందడితో కిక్కిరిసి ఉంటుంది. ఈ తొమ్మిది రోజుల వేడుకల్లో లక్షలాది మంది భక్తులు, సందర్శకులు నగరంలో గుమికూడుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా భద్రత, రవాణా నియంత్రణ పోలీసులకు పెద్ద సవాలు అవుతుంది. ఈ క్రమంలో దుర్గ పండుగలో అశాంతి సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంది నగర పోలీసు యంత్రాంగం

అయితే అధికారుల సమాచారం ప్రకారం శాంతిభద్రతలకు భంగం కలిగించిన మొత్తం 498 మందిని అరెస్టు చేశారు. వీరిలో 348 మందిని చతుర్థి నుండి అష్టమి వరకు (సెప్టెంబర్ 26–30), నవమి రోజున 127 మందిని, విజయదశమి రోజున 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ప్రధానంగా అశాంతి సృష్టించడం, ప్రజా శాంతి భంగం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనల విషయంలో సంఖ్య మరింతగా ఉంది. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు 12,393 మందిపై కేసులు నమోదయ్యాయి. హెల్మెట్ లేకుండా బైక్ నడిపినవారు ఎక్కువగా ఉండగా, అలాంటి 5,512 కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేసిన 2,016 మందిపై, అదుపు తప్పిన రీతిలో డ్రైవింగ్ చేసిన 941 మందిపై మద్యం మత్తులో వాహనం నడిపిన 818 మందిపై చర్యలు తీసుకున్నారు.

భారీ జనసమూహం కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు కోల్‌కతా పోలీస్ 5,000 మందికి పైగా సిబ్బంది, సివిక్ వాలంటీర్లను మోహరించింది. వీరు నగరంలోని ముఖ్య రోడ్లు, పూజా మండపాలు, రద్దీ ప్రాంతాల్లో పహారా కాశారు. విషయమై పోలీసుల బృందం స్పందిస్తూ ఈ చర్యలు కేవలం నియమాలను అమలు చేయడమే కాదు, భవిష్యత్తులోను ఇలాంటి తప్పిదాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక అని, పండుగ ఉత్సాహం మధ్య ప్రజల ప్రాణభద్రతే తమ ప్రధాన కర్తవ్యం అని వారు పేర్కొన్నారు.

దుర్గాపూజ ఉత్సవాల్లో కోల్‌కతా పోలీసుల గట్టి పహారా - Tholi Paluku