
దుర్గం చెరువు 5 ఎకరాల ఆక్రమణలను తొలగించిన హైడ్రా
హైదరాబాద్ నగర నడిబొడ్డున, ఐటీ కారిడార్‌కు ఆనుకుని సీక్రెట్ లేక్‌గా పేరుగాంచిన దుర్గం చెరువును ఆక్రమణల చెర నుంచి విడిపించేందుకు హైడ్రా తీవ్ర చర్యలు చేపట్టింది. మాధాపూర్ ఇన్‌ఆర్బిట్ మాల్ వైపు దుర్గం చెరువు పరిధిలో అక్రమంగా ఆక్రమించిన సుమారు 5 ఎకరాల భూమిని మంగళవారం హైడ్రా అధికారులు తొలగించారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో మట్టితో నింపి వాహనాల పార్కింగ్‌గా మార్చి, ప్రతి నెలా సుమారు రూ.50 లక్షల వరకు అద్దెలు వసూలు చేస్తున్న అక్రమ దందాకు హైడ్రా చెక్ పెట్టింది. అక్కడున్న వాహనాలను తొలగించి, తాత్కాలికంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. తదుపరి దశలో మట్టిని పూర్తిగా తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఈ ఆక్రమణలపై ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించి, క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో విచారణ చేయాలని ఆదేశించారు. విచారణలో ఆక్రమణలు స్పష్టంగా నిర్ధారణ కావడంతో కమిషనర్ ఆదేశాల మేరకు 5 ఎకరాల మేర ఉన్న అక్రమ నిర్మాణాలు, వినియోగాన్ని హైడ్రా అధికారులు తొలగించారు.
గోల్కొండ కోటలోని రాజవంశానికి ఒకప్పుడు తాగునీరు అందించిన చరిత్ర కలిగిన దుర్గం చెరువు నేడు ఆక్రమణల దుర్గంధంతో నలిగిపోతోంది. చుట్టూ కొండల మధ్య స్వచ్ఛమైన నీటితో నగరానికి అందాన్ని చేకూర్చిన ఈ చెరువు, మురుగునీటి ప్రవాహాలు అక్రమ కబ్జాలతో క్రమంగా కుంచించుకుపోయింది. ఒకప్పుడు సుమారు 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దుర్గం చెరువు నేడు కేవలం 116 ఎకరాలకే పరిమితమైంది. ఉత్తర దిశ మినహా మూడువైపులా ఆక్రమణలు జరగడం గమనార్హం.
1976 నాటికే దాదాపు 29 ఎకరాలు ఆక్రమణకు గురై చెరువు విస్తీర్ణం 131.66 ఎకరాలకు తగ్గింది. 1976 నుంచి 1995 వరకు స్థిరంగా ఉన్నప్పటికీ, 1995 నుంచి 2000 మధ్య మరో 10 ఎకరాలు, 2000 తర్వాత మరో 5 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని హైడ్రా అధికారులు తెలిపారు. ఈ ఆక్రమణల పరంపరను ఎన్‌ఆర్‌ఎస్‌సీ అందించిన శాటిలైట్ చిత్రాలు కళ్లకు కడుతున్నాయని పేర్కొన్నారు.
మాధాపూర్ ఇన్‌ఆర్బిట్ మాల్ వైపు కొండలను తవ్వి వచ్చిన మట్టితో చెరువును డంపింగ్ యార్డుగా మార్చి, 10 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు నింపుతూ క్రమంగా 5 ఎకరాల మేర ఆక్రమించారు. ఈ భూమి తమదని ఓ ప్రజాప్రతినిధి క్లెయిమ్ చేస్తుండటం వివాదాస్పదంగా మారింది. హెచ్‌ఎండీఏ 2014లో చెరువు విస్తీర్ణాన్ని 160.7 ఎకరాలుగా నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్‌ఆర్‌ఎస్‌సీ, సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ రికార్డుల ఆధారంగా చెరువు వైశాల్యాన్ని ఖరారు చేసే పనిలో హైడ్రా నిమగ్నమై ఉండగా, ఈలోపు చెరువు పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తూ దుర్గం చెరువును పరిరక్షించేందుకు ముందడుగు వేస్తోంది.
