Let's talk: editor@tmv.in
దుర్గం చెరువును ఆక్రమించారంటూ ఫిర్యాదు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌పై కేసు

దుర్గం చెరువును ఆక్రమించారంటూ ఫిర్యాదు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌పై కేసు

Gaddamidi Naveen
3 జనవరి, 2026

దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. చెరువు భూమిని కబ్జా చేసి, అక్రమంగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

పై కేసు నమోదైంది. మాధాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.హైదరాబాదు రెజిస్ట్రేషన్ సబ్‌జోన్లోని భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు, ప్రభుత్వ ఆస్తుల నష్టం నిరోధక చట్టం క్రింద ఈ కేసు హైడ్రా సంస్థ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేశారు.

ఫిర్యాదు ప్రకారం, 2014లో హెచ్‌ఎండీఏ దుర్గం చెరువు పై ఎఫ్‌టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అందులోనుంచి మినహాయింపులు ఉన్నా, కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఇద్దరు దాదాపు 5 ఎకరాలు చెరువును మట్టి, రాళ్లు పోసి పూడ్చివేశారు. ఆ భూభాగాన్ని ఎస్‌టీఎస్ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ పార్కింగ్ కోసం ఉపయోగించి నెలకు 50 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. ఈ ఆక్రమణ 2014 నుంచి కొనసాగుతుంది అని పేర్కొన్నాయి.

హైడ్రా ఇటీవల మాధాపూర్ ఇన్-ఆర్బిట్ మాల్ సమీపంలోని ఈ 5 ఎకరాల ఆక్రమణలను తొలగించింది.ఈ భూభాగంలో స్కూల్స్, ఐటి కంపెనీల వాహన పార్కింగ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రతీ నెల ఎక్కువ ఆదాయం సృష్టవుతున్నట్లు ఫిర్యాదులో తెలిపింది. కబ్జాదారులు నెలకు దాదాపు రూ. 50 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

దుర్గం చెరువు, హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాచీన జలాశయాల్లో ఒకటి. ఒకప్పుడు గోల్కొండ కోటకు తాగునీరు సరఫరా చేసే విధంగా 160 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు, పలు దశలలో ఆక్రమణల కారణంగా తగ్గింది. 1976లో 29 ఎకరాలు కోల్పోయి, చెరువు 131.66 ఎకరాలుగా మారింది. 1995 వరకు పరిమాణం స్థిరంగా ఉంది. 1995–2000 మధ్య మరో 10 ఎకరాలు నష్టపోయి 121 ఎకరాలవుతాయి. 2000 నుంచి కొనసాగిన భర్తీ, ఆక్రమణల కారణంగా నేడు 116 ఎకరాలు మాత్రమే మిగిలాయి.

అధికారిక రికార్డులు, నోటిఫికేషన్లు ఉన్నప్పటికీ రాజకీయ పలుకుబడితో ఏటా చెరువును ఎలా పూడ్చివేస్తూ వచ్చారో శాటిలైట్ చిత్రాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ కేసు నమోదుతో చెరువు పరిరక్షణలో హైడ్రా దూకుడు పెంచినట్లయింది.

కబ్జా ఆరోపణలపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వివ‌ర‌ణ‌

దుర్గం చెరువు భూభాగంలో ఆక్రమణ కేసు పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో, మీడియా వార్తలపై ఆయన స్పందిస్తూ, అక్కడ ఉన్న భూమి నాదే. దాన్నే వాహనాల పార్కింగ్ కోసం ఇచ్చాం. కానీ ఇటీవల వచ్చిన వార్తలు నిరాధారమైనవి అని అన్నారు.రాజకీయ కక్షతోనే ఇవన్నీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

ఎమ్మెల్యే తెలిపిన‌ వివరాల ప్రకారం, ఈ భూభాగంలో 8 సంవత్సరాల క్రితం టీడీఆర్ జారీ చేయబడిందని, అలాగే హీరో బాలకృష్ణ, రేవంత్ రెడ్డి సోదరుడు కూడా కొన్ని భూములను అక్కడ కలిగి ఉన్నారని తెలిపారు. దుర్గం చెరువులో మేము ఏదో 5 ఎకరాలు కబ్జా చేశామని కేసు పెట్టారు, కానీ నిజానికి మాకు గజం స్థలం లేదు. ప్రభుత్వానికి కూడా గజం స్థలం లేదు అని ఆయన తెలిపారు.

అక్కడ అందరూ వాహనాలను పార్క్ చేస్తారు, ఖాళీ స్థలంలో చెత్తను డంప్ చేస్తారు. హైడ్రా ఫిర్యాదు కారణంగా హైడ్రా అధికారులు తన సిబ్బందికి ఫోన్ చేశారని, తాను స్వయంగా వెళ్లి వివరణ ఇస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అయన 2004లో ఆ పక్కన కొంత స్థలం కొన్నానని, అయితే అది ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని తెలిసి తిరిగి ఇచ్చేశానని తెలిపారు. తనపై కేసు పెట్టిన వారు ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. కావాలనే కుట్రపూరితంగా తనపై కేసు నమోదు చేశారని, చట్టపరంగా దీన్ని ఎదుర్కొంటానని కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు.