Let's talk: editor@tmv.in
దుమారం రేపుతున్న సింగరేణి టెండర్ల వివాదం

దుమారం రేపుతున్న సింగరేణి టెండర్ల వివాదం

Dantu Vijaya Lakshmi Prasanna
23 జనవరి, 2026

ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి టెండర్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా, దీనిపై చర్చకు రావాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి సవాల్ విసిరింది.

కాగా, సింగరేణి సంస్థలో తెలంగాణ ప్రభుత్వానికి 51%, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. ఈ వివాదంపై కీలక నేతల స్పందనలు ఇలా ఉన్నాయి.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు:

రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తేనే సిబీఐ విచారణ సాధ్యమవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం సిద్ధంగా ఉంటే కేంద్రం ఆలోచిస్తుందని చెప్పారు. సింగరేణిలో కేంద్రానికి వాటా ఉన్నప్పటికీ, పూర్తి నియంత్రణ రాష్ట్రానిదేనని ఆయన విమర్శించారు. గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం చిన్న కాంట్రాక్టుల్లో కూడా జోక్యం చేసుకుందని ఆరోపించారు.

రాజకీయ జోక్యం వల్ల సింగరేణి అనేక ఇబ్బందుల్లో పడిందని, రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు రూ. 32,000 కోట్లు బకాయి పడిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు.

నైని బొగ్గు గని టెండర్ల విషయంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారని, అవసరమైతే దిద్దుబాటు చర్యల కోసం అధికారుల బృందాన్ని పంపిస్తామని వెల్లడించారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం

టెండర్ల అక్రమాలపై తక్షణమే విచారణ జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. "దొంగే స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై విచారణ చేయమని కోరతారా?" అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.

కేటీఆర్ ప్రశ్నల వర్షం

“పట్టపగలు దోపిడీచేసిన దొంగ.. ఎక్కడైనా స్వయంగా స్టేషన్ కు వచ్చి తనపై విచారణ జరపాలని కోరతాడా? బీఆర్ఎస్ బయటపెట్టిన సింగరేణి టెండర్ల కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా మీరు స్పందించిన తీరు సరిగ్గా అలాగే ఉంది. ఈ స్కామ్ లో ప్రధాన దోషే ముందుకొచ్చి సీబీఐ కోరితేనే కేంద్రం పరిశీలిస్తుంది అనడం దివాళాకోరు విధానం కాకపోతే మరేంటి? అక్రమ పద్ధతిలో తన బావమరిదికి టెండర్ ను కట్టబెట్టిన ముఖ్యమంత్రి, తానే సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేయాలని ఆశించడం మూర్ఖత్వానికి నిదర్శనం కాదా? ఇది మీ అజ్ఞానమా..? లేక సీఎం రేవంత్ తో మీకు, బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందమా..?” అంటూ కెటిఆర్ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రశ్నలు సంధించారు.

దేశంలో ఎక్కడా లేని “సైట్ విజిట్” నిబంధనను సీఎం పెట్టిందే తన బావమరిదికి అప్పనంగా అప్పజెప్పేందుకని తెలిసినా కేంద్రమంత్రిగా ఇంకా మీరెందుకు దాగుడుమూతలు ఆడుతున్నారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లలో అక్రమాలు బయటపడినా కేంద్రమంత్రిగా మీరు చర్య తీసుకోకపోవడం.. సింగరేణి సంస్థ గొంతుకోయడమే !! అంటూ ఎద్దేవా చేశారు. సింగరేణిలో 49 శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహించడాన్ని చరిత్ర ఎప్పటికీ క్షమించదని గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు.

కేసీఆర్ గారి పాలనలో తక్కువ ధరలకు అంటే, మైనస్ 20 శాతం ధరలకు ఖరారైన టెండర్లను రద్దుచేసి, కొత్త విధానంలో దాదాపు పదిశాతం ప్లస్ కు కాంట్రాక్టులు కట్టబెడుతున్న దుర్మార్గం మీ కళ్లకు కనిపించడం లేదా ?? బీఆర్ఎస్ హయాంలో లాభాల బాటలో నడిచిన సంస్థను, ఈ కాంగ్రెస్ సర్కారు రెండేళ్లలోనే కుంభకోణాలమయంగా మార్చిన అరాచకపర్వాన్ని సింగరేణి కార్మికులు ఎప్పటికీ మరిచిపోరు. క్రమంగా సింగరేణిని నష్టాల ఊబిలోకి నెట్టి చివరికి ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వరుస కుట్రలను కూడా తెలంగాణ కార్మిక లోకం గమనిస్త్తోంది. ఈ భారీ స్కామ్ పై విచారణ జరపాలని క్షేత్రస్థాయిలో సింగరేణి కార్మికులు ఇవాళ మోగించిన జంగ్ సైరన్ రాష్ట్ర సర్కారుకే కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక లాంటిది అని అన్నారు. తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణిని కాంగ్రెస్, బీజేపీల కబంధ హస్తాల నుంచి కాపాడే వరకూ కార్మికులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కదం తొక్కుతూనే ఉంటదంటూ ఎక్స్ లో పేర్కొన్నారు.

మరోపక్క టీబీజీకేస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింగరేణి కోల్ టెండర్లలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్‌ల కుంభకోణాలు, జరిగిన దోపిడీపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గోదావరిఖని RG - 1 జీఎం కార్యాలయం ముందు ధర్నా చేశారు. తెలంగాణ ప్రజలకు ఉపాధినిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి వెన్నముకగా నిలిచిన సింగరేణి సంస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏటీఎమ్‌గా మార్చివేసిందన్నారు.

సాక్షాత్తు సీఎం, డిప్యూటీ సీఎం, మరో మంత్రి అనుయాయులకు నైనీ బ్లాకును కట్టబెట్టేందుకు చేసిన కుట్రలు బహిర్గతం అయ్యాయని, ఇందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పెట్టిన మీడియా సమావేశమే దానికి సాక్ష్యమని వెల్లడించారు. సైట్ విజిటింగ్ సర్టిఫికెట్ అనే కొత్త విధానానికి తెరలేపి ఒరిస్సా లోని నైనీ బ్లాక్ గనులను సింగరేణినీ దోచుకునే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో డీజిల్ సింగరేణి బల్క్ గా సప్లై చేసేది, ఇప్పుడు కాంట్రాక్టర్లకే కేటాయించడంతో మరింత దోపిడీ చేస్తున్నారన్నారు.

గతంలో మైనస్ 20 టెండర్ కోట్ చేస్తే, కాంగ్రెస్ పెద్దలు ప్లస్ 10 కి పెంచి మరింత దోపిడి చేస్తునారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పడు వరకు టెండర్ల దోపిడి పై ఎందుకు స్పందించడం లేదు? కాంగ్రెస్ వచ్చిన రెండేండ్లలో సింగరేణి సంస్థను మొత్తంగా దోపిడి చేస్తున్నారు. కేసీఆర్ హయంలో సింగరేణి సంరక్షించబడిందని వెల్లడించారు.

దోపిడితో సంబంధం ఉన్న ప్రతి అధికారిని, కాంగ్రెస్ పెద్దలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ స్పందన

దీనిపై టీపీసీసీ అ ధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్‌పై బురద చల్లడమే బీఆర్ఎస్ పని అని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టర్లు ఎంత లబ్ధి పొందారో, ప్రస్తుత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో టెండర్లు ఎలా ఉన్నాయో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ చేశారు. తప్పులు జరిగితే సరిదిద్దుకుంటామని ఆయన పేర్కొన్నారు.

కాగా ఇటీవ ల సింగరేణి టెండర్లలో అక్రమాలు జరిగినట్లు మీడియాలో వార్తలు రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని టెండర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు ముదిరాయి. అయితే ఈ టెండర్ల రద్దు పై కేంద్రం ఇద్దరి సభ్యులతో కమిటీ వేసిందని, ఆ కమిటీ మూడు రోజులలో కేంద్రానికి రిపోర్ట్ ఇస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

దీనిపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు బొగ్గు గనులను తమ వారికే కట్టబెట్టి, వాటాలు పంచుకోవాలనుకున్న కాంగ్రెస్ దండుపాళ్యం ముఠా కుట్రలకు బీఆర్ఎస్ చెక్ పెట్టింది. రూ.1600 కోట్ల నైనీ బొగ్గు గనుల టెండర్ల స్కామ్‌ను సాక్ష్యాలతో సహా మీడియా సాక్షిగా బయటపెట్టడంతో, దెబ్బకు స్కాంగ్రెస్ సర్కార్ తోక ముడిచింది, నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

దుమారం రేపుతున్న సింగరేణి టెండర్ల వివాదం - Tholi Paluku