Let's talk: editor@tmv.in
దుబాయ్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి

దుబాయ్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడి

Shaik Mohammad Shaffee
17 మార్చి, 2026

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు యూఏఈని వణికించాయి. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ సముదాయంలోని ఇంధన నిల్వ కేంద్రమే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడికి తెగబడింది. ఈ దాడిలో ఒక ఇంధన ట్యాంకు పేలిపోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకోవడంతో భద్రతా కారణాల దృష్ట్యా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయంలో కార్యకలాపాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

విమానాల మళ్ళింపు.. ప్రయాణికుల ఇక్కట్లు

డ్రోన్ దాడి నేపథ్యంలో దుబాయ్‌కు రావాల్సిన విమానాలను అల్ మక్తౌమ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇతర ప్రాంతీయ విమానాశ్రయాలకు మళ్ళించారు. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని దుబాయ్ మీడియా ఆఫీస్ ధృవీకరించింది. అయితే విమానాశ్రయానికి వెళ్లే టన్నెల్, అల్ గర్హౌద్ బ్రిడ్జి వంటి కీలక మార్గాలను అత్యవసర సేవల కోసం మూసివేయడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేయడంతో వేలమంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఎయిర్ ఇండియా సర్వీసులు రద్దు

విమానాశ్రయ దిగ్బంధం కారణంగా భారత్ నుంచి వెళ్లే సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు దుబాయ్‌కు వెళ్లాల్సిన అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అబుదాబీ, షార్జా, రస్ అల్ ఖైమా విమానాలు మాత్రం యథావిధిగా నడుస్తాయని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. పరిస్థితులు సద్దుమణిగాక కొన్ని గంటల తర్వాత దుబాయ్ విమానాశ్రయం నుంచి పరిమితంగా సర్వీసులను పునఃప్రారంభించారు.

అబుదాబీలో క్షిపణి కలకలం

దుబాయ్‌లో డ్రోన్ దాడి జరుగుతుండగానే, అబుదాబీలోని అల్ బహ్యా ప్రాంతంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఒక క్షిపణి నేరుగా పౌర వాహనాన్ని ఢీకొట్టడంతో పాలస్తీనా జాతీయుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం ఈ స్థాయికి చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైనఖార్గ్ ఐలాండ్‌పై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.

ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ హెచ్చరిక

రాబోయే గంటల్లో దుబాయ్, దోహాలపై మరిన్ని దాడులు చేస్తామని ఇరాన్ మీడియా హెచ్చరికలు జారీ చేసింది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా కీలక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో యూఏఈ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను, వీడియోలను నమ్మవద్దని, కేవలం అధికారిక ప్రకటనలనే పాటించాలని అధికారులు ప్రజలను కోరారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ అరబ్ దేశాలు హై అలర్ట్‌లో ఉన్నాయి.