
దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి లోకేష్
మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్‌ను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. రూ.61 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ క్యాంటీన్ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ముందుగా దుగ్గిరాలకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి క్యాంటీన్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ తీరును, వంటశాల వసతులను ఆయన పరిశీలించారు.
ఇక క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం మంత్రి లోకేష్ అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి అక్కడకు వచ్చిన సామాన్య ప్రజలకు, కార్మికులకు ఆయన భోజనం వడ్డించారు. కొద్దిసేపు వారితో కలిసి ముచ్చటించి, భోజనం నాణ్యతపై ఆరా తీశారు. పేదవారికి తక్కువ ధరకే పౌష్టికాహారం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేసమనేని అనిత తదితరులు పాల్గొన్నారు.
