
దీపావళి సెలవులతో పర్యాటక రంగానికి కొత్త శోభ
దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో భారత్‌లో పర్యాటక స్థలాల్లో అతిధి గృహాలకు భారీ డిమాండ్ కనిపిస్తుంది. నగరాలు, విశ్రాంతి కేంద్రాలు, కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక స్థలాల్లో బుకింగ్‌లు గతం కన్నా మెరుగ్గా ఉన్నాయి. ఇంటర్‌సిటీ బస్సులు 95 నుండి 100 శాతం ప్రయాణికులతో నడుస్తూ, ప్రయాణ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి.
హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, రాడిసన్ హోటల్ గ్రూప్, దక్షిణ ఆసియా చైర్మన్ కె.బి. కచ్రూ మాట్లాడుతూ, ఈ సీజన్‌లో హోటల్ బుకింగ్‌లు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉన్నాయని, కుటుంబం, స్నేహితులతో హాలిడే ఎంజాయ్ చేయడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. జీఎస్టీ సవరణలు మధ్యతరగతి హోటళ్లు, దేశీయ పర్యాటకానికి అనుకూలంగా మారడంతో, ఇప్పటి వరుకు తక్కువ మందికి తెలిసిన కొత్త ప్రదేశాలను కూడా పర్యాటకులు సందర్శిస్తున్నారని వివరించారు. సాంస్కృతిక, ఆరోగ్య, విశ్రాంతి అనుభవాలను కలిపే ప్రత్యేక ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, రెండో శ్రేణి నగరాలు, వారసత్వ స్థలాలు కూడా ఆకర్షిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
మేక్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ మాగో ప్రకారం, స్నేహితులు, బంధువులను కలవడం ప్రధాన ప్రయాణ ఉద్దేశంగా ఉంది. పెద్ద కుటుంబాలు హోమ్‌స్టేలు, విల్లాలను ఎంచుకుంటున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాలు టాప్ గమ్యస్థానాలుగా ఉన్నాయి. పురీ, హరిద్వార్, అయోధ్య, ఋషికేశ్, వారణాసి వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు, గోవా, జైపూర్, ఉదయ్‌పూర్ వంటి వినోద స్థలాలు డిమాండ్‌లో ఉన్నాయి. అంతర్జాతీయంగా యూఏఈ, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం ఆకర్షిస్తున్నాయి.
ఈబిక్స్ ట్రావెల్స్, డెల్ఫీ వరల్డ్ మని లిమిటెడ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ విక్రమ్ ధవాన్ మాట్లాడుతూ, దీపావళి పండుగ వీకెండ్ కు దగ్గరగా కలిసి రావడంతో ముందస్తు బుకింగ్‌లు పెరిగాయని, బస్సు ఛార్జీలు 1.5 నుంచి 3 రెట్లు పెరిగాయని తెలిపారు. రెండో, మూడో శ్రేణి నగరాల మార్గాలు 62 శాతం బుకింగ్‌లు జరిగాయని, చాలా మంది స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నారని చెప్పారు. విమాన ప్రయాణాల్లో ఫ్యామిలీ హాలిడే ట్రిప్స్ 65 నుంచి 70 శాతం ఉన్నాయి. వసతి బుకింగ్‌లు గత ఏడాది కంటే 15 నుండి 20 శాతం పెరిగే అవకాశం ఉందని హోటల్ యాజమాన్యం సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
