Let's talk: editor@tmv.in
“ది లెజెండ్స్ విజన్ - లెగసీ టూర్ ఇండియా” కు సైనా నెహ్వాల్, పీటర్ గేడ్ నాయకత్వం

“ది లెజెండ్స్ విజన్ - లెగసీ టూర్ ఇండియా” కు సైనా నెహ్వాల్, పీటర్ గేడ్ నాయకత్వం

Dantu Vijaya Lakshmi Prasanna
19 నవంబర్, 2025

ఇండియన్ బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్, డెన్మార్క్ లెజెండ్ పీటర్ గేడ్ “ది లెజెండ్స్ విజన్ లెగసీ టూర్ ఇండియా” కు నాయకత్వం వహించనున్నారు. కమ్యూనిటీ ఈవెంట్‌లు, జూనియర్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలు, స్థానిక భాగస్వామ్యాల ద్వారా క్రీడను అభివృద్ధి చేయడమే ఈ ప్రపంచ కార్యక్రమం లక్ష్యం. ఎనిమిది సంవత్సరాల తర్వాత భారతదేశానికి తిరిగి వస్తున్న లెగసీ టూర్ నవంబర్ 23, 24 తేదీలలో న్యూఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరగనుంది.

లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన సైనా, ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్‌తో పాటు ఈ ప్లాట్‌ఫారమ్‌తో కలిసి సరికొత్త లెజెండ్స్‌లో ఒకరిగా చేరారు. "ది లెజెండ్స్ విజన్'ను నా స్వదేశానికి మరోసారి తీసుకురావడం నాకు సంతోషంగా ఉంది," అని సైనా అన్నారు. "బ్యాడ్మింటన్ నాకు జీవితంలో ప్రతిదీ ఇచ్చింది, యువ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే విధంగా కోర్టుకు తిరిగి రావడం ఎప్పుడూ ప్రత్యేకమే."అన్నారు.

నవంబర్ 23న ప్రారంభ రోజున, సైనా, గేడ్, లెజెండ్స్ విజన్ అంబాసిడర్‌లతో ఇంటరాక్టివ్ జూనియర్ ప్రదర్శనలు ఉంటాయి, ఆ తర్వాత భారతదేశంలో “ఎ రాకెట్స్ సెకండ్ లైఫ్” కార్యక్రమం అధికారికంగా ప్రారంభించబడుతుంది.

ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ ప్రపంచ బ్యాడ్మింటన్ కమ్యూనిటీకి తిరిగి ఇవ్వడం గురించే ఉంటుంది. ఈ సందేశం పెరుగుతూ ఉండటం చూసి నేను గర్విస్తున్నాను అని 1999 ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ గేడ్ అన్నారు.

రెండవ రోజు, నవంబర్ 24, ఢిల్లీ-ఎన్‌సిఆర్ అంతటా ఔట్‌రీచ్ కార్యకలాపాలు జరుగుతాయి. ఇక్కడ అభిమానులకు సైనా, గేడ్‌ను కలిసే అవకాశం లభిస్తుంది.ఈ ఈవెంట్ యువ క్రీడాకారులలో బ్యాడ్మింటన్‌పై మరింత ఆసక్తిని పెంచుతుందని, ఈ ప్రాంతం అంతటా క్రీడతో కమ్యూనిటీ అనుబంధాన్ని బలోపేతం చేస్తుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు.