Let's talk: editor@tmv.in
‘ది తాజ్ స్టోరీ’సినిమా విడుదలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

‘ది తాజ్ స్టోరీ’సినిమా విడుదలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

Pinjari Chand
29 అక్టోబర్, 2025

త్వరలో విడుదల కాబోతున్న చిత్రం ' ది తాజ్ స్టోరీ ' విడుదలను, ప్రదర్శనను నిలిపివేసేలా న్యాయపరంగా జోక్యం చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం ( పిఐఎల్ ) దాఖలైంది. ఈ చిత్రం చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందని, మత సామరస్యం, జాతీయ వారసత్వ గౌరవానికి ముప్పు కలిగిస్తుందని ఆరోపిస్తూ ఈ వ్యాజ్యం దాఖలైంది.ఈ పిటిషన్‌ను షకీల్ అబ్బాస్ అనే వ్యక్తి, న్యాయవాది షకీల్ షేక్ ద్వారా దాఖలు చేశారు. అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాను ఆపేందుకు, ప్రదర్శనను నిలిపివేసేందుకు కోర్టు జోక్యాన్ని కోరారు.

అక్టోబర్ 16న విడుదలైన సినిమా ట్రైలర్‌లో తాజ్ మహల్ గుంబజం పైకి లేచి లోపల శివుడి విగ్రహం కనిపించేలా చూపించారు, దీని ద్వారా తాజ్ మహల్ మొదట ఆలయం అని సూచించేలా ఉందని పిటిషన్ లో ఆరోపించారు. ఈ దృశ్యాలు, కథనం పూర్తిగా కల్పితంగా, మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తించే విధంగా ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. సినిమా నిర్మాతలు సి.ఏ. సురేష్ ఝా, తుషార్ అమ్రిష్ గోయల్, సౌరభ్ ఎం. పాండే లు గతంలో కూడా వివాదాస్పద చిత్రాలు తీశారని, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సరైన పరిశీలన చేయకుండానే సర్టిఫికెట్ ఇచ్చిందని పిటిషన్‌లో ఆరోపించారు.

తాజ్ మహల్ యునెస్కో వారసత్వ ప్రదేశం, భారత పురావస్తు శాఖ సంరక్షణలో ఉందని, అటువంటి జాతీయ వారసత్వానికి అవమానకరంగా చిత్రీకరించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(ఎఫ్) ప్రకారం దేశ వారసత్వ పరిరక్షణ పౌరుల బాధ్యత అని, అదే బాధ్యత ప్రభుత్వానికీ ఉందని వాదించారు.

ఇదే సమయంలో పిటిషనర్ కోర్టును అభ్యర్థిస్తూ సినిమాకు సర్టిఫికేషన్ నిలిపివేయాలని లేదా, తగిన డిస్క్లెయిమర్లు(ఈ సినిమా చారిత్రక వాస్తవాల ఆధారంగా కాదని, ఇది కల్పితం మాత్రమే) చేర్చాలని, విడుదలకు ముందే నిజ నిర్ధారణ చేయాలని కోరారు. ఈ చిత్రం విడుదలతో సామాజిక విభజన పెరిగే అవకాశం ఉందని, ప్రభుత్వ, సెన్సార్ సంస్థలు జాగ్రత్తగా వ్యవహరించాలని పిటిషన్‌లో స్పష్టం చేశారు.

భారతదేశంలో వివాదాస్పద చిత్రాల జాబితా

1. పద్మావత్ –2018

దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ

వివాదం: రాజ్‌పుత్ సమాజానికి అవమానం చేశారనే ఆరోపణలు.

అల్లాద్దీన్ ఖిల్జీ–పద్మావతి మధ్య సంబంధం చూపిన తీరు మీద తీవ్ర ఆగ్రహం.

పరిణామం: దేశవ్యాప్తంగా నిరసనలు, థియేటర్ల పై దాడులు, దీంతో పేరు “పద్మావతి” నుంచి “పద్మావత్”గా మార్చారు.

2. ది కాశ్మీర్ ఫైల్స్ –2022

దర్శకుడు: వివేక్ అగ్నిహోత్రి

వివాదం: 1990లలో కాశ్మీరీ పండిట్‌లను చూపిన తీరు ఏకపక్షంగా ఉందని విమర్శలు.

పరిణామం: రాజకీయంగా విభజనాత్మక వాదనలు, పలు రాష్ట్రాల్లో పన్ను రాయితీలు – అదే సమయంలో మతపర ఉద్రిక్తతల ఆరోపణలు.

3. ది కేరళ స్టోరీ –2023

దర్శకుడు: సుదీప్తో సేన్

వివాదం: 32,000 మహిళలు ఐఎస్ఐఎస్ లో చేరారని చూపడం అసత్యమని విమర్శలు.

పరిణామం: పశ్చిమ బెంగాల్‌లో నిషేధం, సుప్రీం కోర్టు జోక్యం, దేశవ్యాప్తంగా తీవ్రమైన రాజకీయ ప్రతిస్పందనలు.

4. హైడర్ –2014

దర్శకుడు: విశాల్ భరద్వాజ్

వివాదం: భారత సైన్యంపై ప్రతికూల దృశ్యాలు చూపారని, దేశభక్తిని అవమానించారని విమర్శలు.

5. బాంబే –1995

దర్శకుడు: మణిరత్నం

వివాదం: హిందూ–ముస్లిం మత సంబంధ ప్రేమకథ. 1992 ముంబై అల్లర్ల నేపథ్యం చూపడం వల్ల మతపర సంఘాలు వ్యతిరేకించాయి.

6. అశోక –2001

దర్శకుడు: సంతోష్ శివన్

వివాదం: చారిత్రక సత్యాల వక్రీకరణ, సామ్రాట్ అశోకుడి జీవితాన్ని రొమాంటిక్‌గా చూపారని విమర్శలు.

7. పీకే–2014

దర్శకుడు: రాజ్‌కుమార్ హిరానీ

వివాదం: మతాచారాలపై వ్యంగ్య వ్యాఖ్యలు; హిందూ మతాన్ని అవమానించారని ఆరోపణలు.

8. మైనే గాంధీ కో నహీ మారా –2005

వివాదం: గాంధీజీని హత్య చేశాననే భ్రాంతిలో ఉన్న వ్యక్తి కథ – కొందరు గాంధీ దూషణగా విమర్శించారు.