Let's talk: editor@tmv.in
‘ది డెక్‌’లో మిట్టల్ కార్యాలయం?

‘ది డెక్‌’లో మిట్టల్ కార్యాలయం?

FL - YUGDR
29 సెప్టెంబర్, 2025

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) సిరిపురం జంక్షన్‌లో నిర్మించిన ప్రతిష్టాత్మక 'ది డెక్' ఐకానిక్ భవనంలో ఆఫీసు స్థలం కోసం పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతున్నాయి. వాస్తవానికి దీనిని పార్కింగ్ కోసం నిర్మించారు. మల్టీ లెవెల్ కారు పార్కింగ్ భవనం డిజైన్ చేశారు. అందులోనే ఆఫీస్ స్పేస్‌కు అవకాశం కల్పించారు. మొత్తం 12 అంతస్తుల్లో మూడు బేస్మెంట్లు, రెండో అంతస్తును పార్కింగ్ కోసం కేటాయించారు. మిగిలిన వాటిని ఆఫీస్ కోసం డిజైన్ చేశారు. అందులో రెండు అంతస్తులను జార్జియా యూనివర్సిటీ, బెల్ ఐటీ కంపెనీ తీసుకున్నాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కోసం ఒక ఫ్లోర్ కేటాయించారు. దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయం కోసం రెండు అంతస్తులు తీసుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా ఉండగా దాని కోసం మూడు సంస్థలు పోటీ పడ్డాయి.

వేలంలో భారీ ధర

భవనంలో ఆఫీసు స్థలం కోసం ఈ నెల 19న వేలం వేశారు. చదరపు అడుగుకు రూ.82 అద్దె ఇవ్వడానికి ఓ సంస్థ ముందుకువచ్చింది. సుమారు 29 వేల చ.అ. స్థలం తీసుకుంది. దీంతో పార్కింగ్ మినహా అని అంతస్తులు నిండిపోయాయి. అయితే నక్కపల్లిలో స్టీల్ ప్లాంటు పెడుతున్న ఆర్సెలర్ మిట్టల్ నిహన్ కంపెనీ తమ ఆఫీసు కోసం 'ది డెక్'లో స్థలం కావాలని పట్టుబడుతోంది. తక్షణమే తమకు కేటాయించకపోతే స్టీల్ ప్లాంటు పనులు ఆలస్యమవుతాయని చెబుతోంది. రెండో అంతస్తులో పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాన్ని తమకు ఇవ్వాలని కోరుతోంది. అవసరమైన మార్పులు చేసుకొని కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని చెబుతోంది. దీంతో వీఎంఆర్డీఏ అధికారులు అమరావతి అధికారులతో మాట్లాడి బోర్డులో దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

వాస్తవానికి సిరిపురం జంక్షన్‌లో పార్కింగ్‌కు పెద్ద డిమాండ్ లేదు. చిల్డ్రన్ ఎరీనాలో అవసరమైనంత పార్కింగ్ స్థలం ఉంది. వీఎంఆర్డీఏకు వచ్చే వారికి పార్కింగ్ స్థలం ఉంది. సమీపంలో ఎక్కువ మంది పార్కింగ్ చేసే అవకాశం లేకపోవడంతో మిట్టల్ సంస్థకు దీన్ని కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. ఒక ప్రభుత్వ సంస్థ వినూత్నంగా నిర్మించిన భవనానికి విశేషాలు అధికారులను ఆనందింపచేస్తోంది. పలు ప్రభుత్వ సంస్థలు ఈ రకంగా భవనాల నిర్మించకుండా పిపిపి పేరిట ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా కట్టబెట్టడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

‘ది డెక్‌’లో మిట్టల్ కార్యాలయం? - Tholi Paluku