Let's talk: editor@tmv.in
దివ్యాంగుల సంక్షేమానికి రూ. 100 కోట్లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

దివ్యాంగుల సంక్షేమానికి రూ. 100 కోట్లు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Gaddamidi Naveen
28 జనవరి, 2026

రాష్ట్రంలోని దివ్యాంగుల సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో జరిగిన లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంలో జరగని అభివృద్ధిని కేవలం రెండేళ్లలోనే సాధించి చూపామని అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ స్వల్ప కాలంలోనే రూ. 100 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వెల్లడించారు.

విద్య రంగంలో దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేక మద్దతు అందిస్తున్నామని, వారి విద్యాభివృద్ధి కోసం ఐప్యాడ్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు వంటి ఆధునిక సాంకేతిక పరికరాలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. ఇవి దివ్యాంగ విద్యార్థులకు చదువులో సమాన అవకాశాలు కల్పించడమే కాకుండా, భవిష్యత్తులో స్వావలంబన సాధించేందుకు దోహదపడతాయని ఆయ‌న‌ పేర్కొన్నారు.

దివ్యాంగులకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, గౌరవప్రదమైన జీవితం, ఉపాధి అవకాశాలు, సామాజిక సమానత్వం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రతి దివ్యాంగుడు ఆత్మవిశ్వాసంతో సమాజంలో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

సమగ్ర అభివృద్ధి సాధ్యమయ్యేది ప్రతి వర్గాన్ని కలుపుకొని ముందుకు సాగినప్పుడేనని, దివ్యాంగుల భాగస్వామ్యంతోనే నిజమైన సమానత్వం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల సాధికారతకు నిరంతరం కట్టుబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.

సింగరేణి కార్మికులకు వరం

సింగరేణి కార్మికుల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపట్టిందన్నారు. ఉద్యోగుల పేరుమార్పు సమస్యలను వెంటనే పరిష్కరించడం, మెడికల్ ఇన్వాలిడేషన్ కేసులను వైద్య మండళ్ల ద్వారా పరిశీలించి న్యాయం చేయడం వంటి చర్యలు ఇందులో భాగమని తెలిపారు. అలాగే కోల్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా కార్మికులకు అధికార స్థాయి సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

కార్మికుల ఇంటి కలను సాకారం చేయడానికి గృహ నిర్మాణానికి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. శాశ్వత కార్మికులకు రూ.1.25 కోట్ల ప్రమాద బీమా అమలు చేస్తూ, ఇది దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అలాగే సుమారు 30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.40 లక్షల ఉచిత ప్రమాద బీమా కల్పించినట్లు పేర్కొన్నారు.

కారుణ్య నియామకాల వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచామని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2,539 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. సింగరేణి ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. 2024–25లో సింగరేణి రూ.6,394 కోట్ల లాభం సాధించగా, అందులో రూ.802 కోట్లను కార్మికులతో పంచుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.