
దివ్యాంగుల డేటా సేకరణకు జనగణన–2027 చారిత్రాత్మక అవకాశం: రాందాస్ అథవాలే
రాబోయే జనగణన 2027 దివ్యాంగుల సమగ్ర డేటా సేకరణకు ‘చారిత్రాత్మక అవకాశం’గా మారనుందని కేంద్ర సామాజిక న్యాయం శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే పేర్కొన్నారు. మంగళవారం ‘బియాండ్ ది విజిబుల్: ఏ హ్యాండ్‌బుక్ ఆన్ డిసబిలిటీ ఇన్‌క్లూజన్ ఫర్ పార్లమెంటేరియన్స్’ అనే గ్రంథావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2016లో అమల్లోకి వచ్చిన రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016 తర్వాత జరగబోయే తొలి జనగణన ఇదేనని చెప్పారు. ఈ చట్టం ద్వారా మొత్తం 21 రకాల దివ్యాంగతలను గుర్తిస్తూ సంక్షేమ విధానాల నుంచి హక్కుల ఆధారిత దృక్పథానికి మార్పు తీసుకువచ్చిందని, ఐక్యరాజ్యసమితి దివ్యాంగుల హక్కుల ఒప్పందం (యూఎన్‌సీఆర్‌పీడీ)కు అనుగుణంగా భారత్‌ను తీసుకెళ్లిందని అథవాలే వివరించారు. దివ్యాంగులపై సమగ్ర గణాంకాలు, విభజిత డేటా లభిస్తే ప్రభుత్వానికి లక్ష్యిత విధానాలు రూపొందించడంలో సులభతరం అవుతుందని ఆయన అన్నారు. దీంతో దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
దివ్యాంగుల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు. యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్, యూనిక్ డిసెబిలిటీ(యూడీఐడీ)) పోర్టల్, పీఎం-దక్ష్ కింద నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం ద్వారా దివ్యాంగులను ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ హ్యాండ్‌బుక్‌ను నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (ఎన్‌సీపీఈడీపీ), బజాజ్ ఫిన్‌సర్వ్ సంయుక్తంగా రూపొందించాయి. ఈ గ్రంథం పార్లమెంట్‌లోనే కాకుండా సమాజంలో దివ్యాంగుల హక్కులపై చర్చను విస్తరించడంలో దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఎన్‌సీపీఈడీపీ కార్యనిర్వాహక దర్శకుడు ఆర్మాన్ అలీ మాట్లాడుతూ, ఈ హ్యాండ్‌బుక్ చట్టపరమైన నిబంధనలను కార్యాచరణలోకి తీసుకురావడానికి సహాయపడుతుందని అన్నారు. ఇది భారత ప్రజాస్వామ్యంలో సమగ్రతను వాస్తవంగా అమలు చేయడానికి దోహదం చేస్తుందన్నారు. ఇటీవల నిర్వహించిన ఎన్‌సీపీఈడీపీ సర్వే ప్రకారం, 80 శాతం కంటే ఎక్కువ మంది దివ్యాంగులకు ఆరోగ్య బీమా అందుబాటులో లేదని ఆయన వెల్లడించారు. అధిక ప్రీమియం, చికిత్సల మినహాయింపు, బీమా నిరాకరణ వంటి సమస్యలు ఇందుకు కారణమని చెప్పారు. అందువల్ల వికలాంగులకు అనుకూలమైన ఆరోగ్య విధానాలు అవసరమని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపాదించిన సమగ్ర ఆరోగ్య దృక్పథం కింద ‘ఆయుష్మాన్ భారత్’ పథకంలో దివ్యాంగులకు ప్రత్యేక కవరేజీ కల్పించాలని, సహాయక పరికరాలు, పునరావాసం, ప్రత్యేక వైద్యం వంటి అంశాలను చేర్చాలని అర్మాన్ అలీ కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల ఆరోగ్య కవరేజీ, రాజకీయ భాగస్వామ్యం అంశాలపై ప్యానల్ చర్చ కూడా జరిగింది. ఇందులో ఈటీ మహ్మద్ బషీర్, ఈటెల రాజేందర్, ఫౌజియాఖాన్, గురుప్రకాశ్ పాశ్వాన్, నేహజోషి, అనీష్ గవాండే తదితరులు పాల్గొన్నారు.
