Let's talk: editor@tmv.in
దివ్యాంగులకు ఏపీ సర్కార్ ‘ఉగాది’ కానుక: ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

దివ్యాంగులకు ఏపీ సర్కార్ ‘ఉగాది’ కానుక: ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

Panthagani Anusha
18 మార్చి, 2026

రాష్ట్రంలోని దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉగాది పండుగను పురస్కరించుకుని వారికి ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ‘దివ్యాంగ శక్తి’ పథకానికి శ్రీకారం చుట్టనుంది. కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. గత ఏడాది అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఏయే బస్సుల్లో అంటే..

ప్రస్తుతం అమలులో ఉన్న ‘స్త్రీ శక్తి’ (మహిళలకు ఉచిత ప్రయాణం) పథకం వర్తించే అన్ని బస్సుల్లోనూ దివ్యాంగులు ఇకపై ఉచితంగా ప్రయాణించవచ్చు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో కలిపి మొత్తం 7,264 బస్సుల్లో (ఆర్టీసీలోని 73 శాతం బస్సులు) ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 40 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారు ఎవరైనా సరే, ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా రాష్ట్రమంతటా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా, దివ్యాంగుల వెంటే ఉండే సహాయకులకు కూడా టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పించడం విశేషం.

లబ్ధిదారుల పరిధి పెంపు

గతంలో కేవలం 4 వర్గాల దివ్యాంగులకు మాత్రమే పరిమితమైన రాయితీలను ఇప్పుడు 21 వర్గాలకు విస్తరించారు. శారీరక, మానసిక వైకల్యంతో పాటు ఆటిజం, నాడీ సంబంధిత వ్యాధులు, పార్కిన్సన్స్, తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి వ్యాధిగ్రస్తులకు కూడా ఈ పథకం భరోసా ఇవ్వనుంది. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య 2.05 లక్షల నుంచి ఏకంగా 12.76 లక్షలకు పెరగనుంది. ఇందులో 11.16 లక్షల మంది దివ్యాంగులు కాగా 1.60 లక్షల మంది సహాయకులు ఉన్నారు. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఏటా రూ. 207 కోట్ల అదనపు భారాన్ని భరించనుంది.

డిజిటల్ పాస్‌లతో సులభతరం

దివ్యాంగులు ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడకుండా సాంకేతికతను జోడించారు. ఇప్పటికే ఉన్న 3 ఏళ్ల కాలపరిమితి గల పాస్‌లు ఈ పథకానికి చెల్లుబాటు అవుతాయి. కొత్తగా పాస్‌లు పొందే వారు ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్‌ యాప్ లేదా ఏపీఎస్‌ ఆర్టీసీ యాప్ ద్వారా డిజిటల్ పాస్‌లను పొందవచ్చు. వీటిని ‘సదరం’ డేటాబేస్‌తో అనుసంధానించడం వల్ల భౌతిక ధృవీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం లేదు. కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఉచిత టికెట్ జారీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 134 ఆర్టీసీ కౌంటర్లలో కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.