Let's talk: editor@tmv.in
దిలీప్‌పై కుట్ర ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైంది: కోర్టు

దిలీప్‌పై కుట్ర ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైంది: కోర్టు

Pinjari Chand
14 డిసెంబర్, 2025

2017లో కేరళను కుదిపేసిన నటి లైంగిక దాడి కేసులో మలయాళ సినీ నటుడు దిలీప్‌పై కుట్ర ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని ఎర్నాకులం జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. జడ్జి హనీ ఎం. వర్గీస్ ఈ కేసుకు సంబంధించిన పూర్తి తీర్పును శుక్రవారం రాత్రి విడుదల చేశారు. ప్రాసిక్యూషన్ వాదనల్లో అనేక అ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, దిలీప్‌పై నేరం మోపడానికి అవసరమైన నమ్మదగిన, సరిపోయే సాక్ష్యాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది.

కుట్ర ఆరోపణలపై కోర్టు పరిశీలన

పల్సర్ సునీ (నిందితుడు నం.1) దిలీప్ (నిందితుడు నం.8) కలిసి బాధితురాలిపై లైంగిక దాడికి కుట్ర పన్నారన్న ఆరోపణను కోర్టు సవివరంగా పరిశీలించింది.

దాడి సమయంలో బాధితురాలి గుర్తింపును స్పష్టంగా చూపించేందుకు ఆమె ధరించిన బంగారు ఉంగరాన్ని వీడియోలో చిత్రీకరించారన్న ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు విశ్వసించలేదు. ఈ అంశం మొదటి చార్జ్‌షీట్‌లో లేదని, రెండో చార్జ్‌షీట్‌లో మాత్రమే చేర్చారని కోర్టు గుర్తించింది. బాధితురాలి వాంగ్మూలాల్లో కూడా ఈ విషయం గురించి మొదట ఎక్కడా ప్రస్తావనకు రాలేదని పేర్కొంది.

వాంగ్మూలాల్లో ఆలస్యం

బాధితురాలి వాంగ్మూలాలు 2017 ఫిబ్రవరి 18 నుంచే నమోదు చేసినప్పటికీ, జూన్ 3, 2017 వరకు దిలీప్‌పై ఆరోపణలు చేయలేదని కోర్టు తెలిపింది. లైంగిక దాడి వీడియోలను రెండుసార్లు చూసినప్పటికీ, ఉంగరం చిత్రీకరణపై ఆమె అప్పట్లో ఏమాత్రం ప్రస్తావించకపోవడం వివరణకు అందని అంశమని కోర్టు వ్యాఖ్యానించింది.

అప్రూవర్ల వాంగ్మూలాలపై కోర్టు అభిప్రాయం

కేసులో కీలకంగా మారిన అప్రూవర్లు కోర్టులో తమ వాంగ్మూలాలను మార్చినట్లు స్పష్టమైందని కోర్టు తెలిపింది. ఒక అప్రూవర్ దిలీప్ సూచన మేరకే ఉంగరాన్ని షూట్ చేశామని చెప్పినప్పటికీ, దర్యాప్తు సమయంలో ఇలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని కోర్టు గుర్తించింది. మరో అప్రూవర్ బాధితురాలి నిశ్చితార్థం పూర్తయిందని దిలీప్ చెప్పాడని పేర్కొన్నా, నేరం జరిగిన తరువాతే ఆమె నిశ్చితార్థం జరిగినట్టు రికార్డులు చూపిస్తున్నాయని కోర్టు తేల్చింది.

పాత కుట్ర ఆరోపణలు కొట్టివేత

దిలీప్ 2013 నుంచే ఈ నేరానికి కుట్ర పన్నాడన్న వాదనకు నమ్మదగిన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. 2017 జనవరిలో గోవాలో బాధితురాలిపై లైంగిక దాడి ప్రయత్నం జరిగిందన్న ఆరోపణను కూడా కోర్టు తిరస్కరించింది. సాక్షుల వాంగ్మూలాల ప్రకారం అక్కడ ఎలాంటి ఘటనలు జరగలేదని పేర్కొంది.

తీర్పు వివరాలు

• డిసెంబర్ 8న వెలువడిన తీర్పులో కోర్టు

• మలయాళ నటుడు దిలీప్‌తో పాటు మరో ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేసింది

• ప్రధాన నిందితుడు పల్సర్ సునీ సహా ఆరుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది

ఘటన వివరాలు

2017 ఫిబ్రవరి 17న నిందితులు బాధితురాలి కారులోకి బలవంతంగా ప్రవేశించి, దాదాపు రెండు గంటల పాటు కారును తమ ఆధీనంలో ఉంచుకుని, కదులుతున్న కారులోనే లైంగిక దాడి చేసి వీడియో చిత్రీకరించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

దిలీప్‌పై కుట్ర ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైంది: కోర్టు - Tholi Paluku