Let's talk: editor@tmv.in
‘దిత్వా’తో తమిళనాడు అతలాకుతలం

‘దిత్వా’తో తమిళనాడు అతలాకుతలం

Pinjari Chand
1 డిసెంబర్, 2025

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి తీరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, 149 పశువులు చనిపోయాయి. సుమారు 57 వేల హెక్టార్ల వ్యవసాయ భూమి నీట మునిగి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం దిత్వా తుఫాను ఇప్పటికే బలహీనపడుతోంది. చెన్నైకి ఆగ్నేయంగా 180 కి.మీ., కడలూరుకు తూర్పు-ఆగ్నేయంగా 100 కి.మీ. దూరంలో ఉంది. రాబోయే 24–36 గంటల్లో తీరానికి సమాంతరంగా ఉత్తరం వైపు కదిలి, తీరం తాకకుండానే బలహీనపడి అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నవంబర్ 30 రాత్రి నుంచి డిసెంబర్ 1 వరకు కింది జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నాగపట్నం, మైలదుత్తురై, తిరువారూర్ ,తంజావూరు, కడలూరు, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, పుదుచ్చేరి, కరైకల్ ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కడలూరు, నాగపట్టణం, రామనాథపురం జిల్లాల్లో వరద ఉద్ధృతి పెరిగి, అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు.

తంజావూరు, తూత్తుకుడిలో గోడ కూలి ఇద్దరు మృతి చెందగా, మైలాదుతురైలో విద్యుత్ షాక్‌కు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు ఇక వరదల దృష్ట్యా రాష్ట్ర అత్యవసర విపత్తు నిర్వహణ సంస్థలు మొత్తం 38 బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని, మరో 10 బృందాలు శనివారం రాత్రి నుంచి సహాయక చర్యల్లో చేరినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కె.ఎస్.ఎస్.ఆర్. రామచంద్రన్ తెలిపారు. యెమెన్ సూచించిన 'దిత్వా' అనే పేరు ఒక సరస్సును సూచిస్తుంది. సోకోట్రా వాయువ్య తీరంలో ఉన్న ఒక పెద్ద ఉప్పునీటి సరస్సు డెట్వా సరస్సు నుంచి ఈ పేరు వచ్చింది. సోకోట్రీ భాషలో దిత్వా/డెట్వా అంటే ‘పచ్చని లోయల మధ్య ఉన్న సరస్సు’ లేదా ‘సముద్రంతో కలిసే ప్రశాంతమైన నీటి ప్రదేశం’ అని స్థానికంగా ఉన్న అర్థం.