
దావోస్ 2025 పెట్టుబడి ఒప్పందాలు కార్యరూపం దాల్చాయి: సీఎం
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2026 సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని ఘనంగా చాటారు. సదస్సు నాలుగో రోజున టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో భేటీ అయిన ఆయన 2025 దావోస్ పర్యటనలో కుదిరిన ఒప్పందాల ద్వారా ఇప్పటికే రూ. 2.50 లక్షల కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చి, వివిధ ప్రాజెక్టులుగా అమలులో ఉన్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ పెట్టుబడి దారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతూ గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వ్యవసాయం,పర్యాటక రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులను సీఎం వివరించారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో భారీ సోలార్ ప్రాజెక్టులు, విశాఖపట్నంలో టి.సి.ఎస్ డెవలప్‌మెంట్ సెంటర్, అమరావతిలో ప్రతిష్టాత్మక 'క్వాంటం వ్యాలీ' ఆర్ అండ్ డి కేంద్రాలు రాష్ట్ర రూపురేఖలను మార్చబోతున్నాయని పేర్కొన్నారు. యువశక్తికి నైపుణ్యం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని, అందుకే ఐటీ, ఏఐ రంగాల్లో పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముందుచూపును అభినందించారు. ' రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్' ద్వారా రాష్ట్రంలోని ప్రాజెక్టుల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్టులు, స్పోర్ట్స్ సిటీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరగా, టాటా గ్రూప్ నుంచి పూర్తిస్థాయి సాంకేతిక, నిర్వహణ సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రపంచ స్థాయి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చూపుతున్న ఆసక్తిని చంద్రబాబు ప్రస్తావించారు. రాష్ట్రంలో నెలకొన్న పెట్టుబడి అనుకూల వాతావరణం, సుస్థిరమైన ప్రభుత్వ విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ త్వరలోనే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పెరగడమే కాకుండా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా పర్యటనలో భాగంగా మూడో రోజైన బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోయే భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై తుది నిర్ణయానికి వచ్చారు. తొలిదశలో దాదాపు రూ. 60 వేల కోట్లతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామని వచ్చే నెల 15తేదీ తర్వాత ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.
అదేవిధంగా ప్లాంటుకు సంబంధించి రావాల్సిన అనుమతులపై సీఎం చంద్రబాబు మిట్టల్ సమక్షంలోనే అధికారులతో సమీక్షించారు. ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన చేయబోతున్నాం, ఈలోగానే భూసేకరణ, అనుమతుల అంశాలు పూర్తి చేయాలి. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అనుమతులు సాధించాలి. ఈ బాధ్యతలను మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ తీసుకోవాలి అని సీఎం ఆదేశించారు.
