Let's talk: editor@tmv.in
దావోస్ సదస్సు: తొలిరోజు తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడుల వెల్లువ!

దావోస్ సదస్సు: తొలిరోజు తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడుల వెల్లువ!

Gaddamidi Naveen
21 జనవరి, 2026

వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం మంగళవారం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు చేరుకుంది. దావోస్‌కు వెళ్లే మార్గంలో జ్యూరిచ్ విమానాశ్రయంలో దిగిన ముఖ్యమంత్రికి, అక్కడ నివసిస్తున్న ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు.

డబ్ల్యూఈఎఫ్ సమావేశాల తొలి రోజునే తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, ఉన్నతాధికారులు, ప్రతినిధులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎక్స్‌క్లూజివ్ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్‌మ్యాప్‌ను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి దృష్టికోణం, ప్రగతిశీల విధానాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రపంచ నాయకులు, సీఈఓలు, పరిశ్రమల ప్రతినిధుల ముందు ప్రదర్శించనున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది. 2025 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’లో సీఎం రేవంత్ రెడ్డి ఈ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే దీని ప్రధాన లక్ష్యం. గతంలో 2025లో జరిగిన దావోస్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్రం రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన విషయం గమనార్హం.

ఇజ్రాయెల్‌తో స్టార్టప్ ఇన్నోవేషన్ ఒప్పందం

దావోస్ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బృందం ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలన్ స్టోపెల్‌తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో వ్యవసాయం, వాతావరణ మార్పులు, స్టార్టప్ ఆవిష్కరణల రంగాల్లో ఇప్పటికే కొనసాగుతున్న భాగస్వామ్యాలపై విస్తృతంగా చర్చించారు. కృత్రిమ మేధస్సు, డీప్‌టెక్ ఆధారిత హెల్త్‌టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ సహకారం అందించనున్నట్లు వెల్లడించారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఇజ్రాయెల్ స్టార్టప్‌లతో కలిసి ఏఐ ఆధారిత పైలట్ కార్యక్రమాలను తెలంగాణ ప్రారంభించనుంది.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 వార్షిక సదస్సులో భాగంగా దావోస్‌లో ఏర్పాటు చేసిన 'ఇండియా పెవిలియన్'ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ వేదికపై ‘తెలంగాణ రైజింగ్’ నినాదంతో ప్రపంచ పెట్టుబడిదారులను ఆయన ఆహ్వానించారు.

దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా ఇండియా పావిలియన్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన మంత్రి, 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అలాగే భారత జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే దిశగా రోడ్‌మ్యాప్‌తో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధిలో జీవ విజ్ఞానాలు (లైఫ్ సైన్సెస్), కృత్రిమ మేధస్సు (ఏఐ), ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, పునరుత్పాదక శక్తి, గ్రీన్ టెక్నాలజీలు, తయారీ రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి వివరించారు. దావోస్ వేదికగానే లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0తో పాటు తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభాన్ని ప్రకటించారు.

గత రెండేళ్లలో రాష్ట్రంలో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించామని, ఈ పెట్టుబడులతో ఉపాధి అవకాశాల సృష్టి, స్థిరమైన వృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’తో సౌదీ దిగ్గజ సంస్థ ‘ఎక్స్‌పర్టీస్’ భాగస్వామ్యం!

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ విజయాన్ని అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ తో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ ‘ఎక్స్‌పర్టీస్’ ముందుకొచ్చింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం ఆ సంస్థ సీఈఓ మొహమ్మద్ ఆషిఫ్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా ‘ఎక్స్‌పర్టీస్’ సంస్థ తమకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది.

తమ సంస్థకు ప్రతి ఏటా సుమారు 5,000 మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమని, వారిని స్కిల్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ ఇచ్చి రిక్రూట్ చేసుకుంటామని ఆషిఫ్ ప్రకటించారు.పెట్రోకెమికల్, ఆయిల్ & గ్యాస్, స్టీల్, సిమెంట్, పవర్ జనరేషన్ వంటి ప్లాంట్ మెయింటెనెన్స్ రంగాల్లో ఈ శిక్షణ సాగనుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యకు-ఉద్యోగానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, పరిశ్రమల యాజమాన్యమే నేరుగా నిర్వహించే దేశంలోని తొలి స్కిల్ యూనివర్సిటీ ఇదని, ఇది 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా ఒక కీలక అడుగు అని తెలిపారు. పూర్తిగా పరిశ్రమల ఆధ్వర్యంలో నిర్వహణ కలిగిన తొలి యూనివర్సిటీగా నిలుస్తుందని చెప్పారు.

ఇది ఇలా ఉండగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యు ఈ ఎఫ్ ) 2026 సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. మంగళవారం యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్, యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో కలిసి యూఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్‌ పని చేసేందుకు అల్ మార్రీ అంగీకారం తెలిపారు. . దీనితో పాటు సుమారు 40 యూఏఈ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రోత్సహిస్తామని ఆ దేశ మంత్రి హామీ ఇవ్వడంతో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి పెట్టుబడుల వెల్లువ మొదలైంది.

కాగా ఈ పర్యటనలో రాష్ట్రానికి మరో భారీ పారిశ్రామిక విజయం దక్కింది. ప్రముఖ ఇంధన నిల్వ పరిష్కారాల సంస్థ 'కెమ్‌వోల్ట్ గ్లోబల్' ఆంధ్రప్రదేశ్‌లో 5 గిగావాట్ గంటల (5 జి డబ్ల్యూ హెచ్) సామర్థ్యం కలిగిన లిథియం,అయాన్ సెల్ తయారీ గిగాఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు రూ. 2,500 కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్లాంట్ దేశీయంగా క్లీన్ మొబిలిటీ గ్రిడ్ స్థాయి ఎనర్జీ స్టోరేజ్ అవసరాలను తీర్చడంలో కీలకం కానుంది. ఈ గిగాఫ్యాక్టరీ ద్వారా సుమారు 1,500 మందికి ప్రత్యక్షంగా మరియు 4,000 మందికి పైగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దశలవారీగా చేపట్టే ఈ ప్రాజెక్టులో తొలి భాగం 2027 నాటికి అందుబాటులోకి రానుండగా 2029 కల్లా పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకోనుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూఏఈ మంత్రితో జరిగిన చర్చల్లో రాష్ట్రంలోని పోర్టులు, లాజిస్టిక్స్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. షరాఫ్ గ్రూప్ ద్వారా మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ పార్క్, డీపీ వరల్డ్ సహకారంతో భారీ పోర్టు టెర్మినల్స్, అదేవిధంగా అమరావతి నిర్మాణంలో అత్యాధునిక లైట్ గేజ్ స్టీల్ టెక్నాలజీని ఉపయోగించడం వంటి అంశాలపై కీలక చర్చలు జరిగాయి. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ సహకారంతో ఎనర్జీ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటుపై సానుకూల స్పందన లభించింది. ఏపీని అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే తన లక్ష్యానికి ఈ ఒప్పందాలు పునాది వేస్తాయని సీఎం ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

దావోస్ సదస్సు: తొలిరోజు తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడుల వెల్లువ! - Tholi Paluku