
దావోస్ సదస్సులో తెలంగాణకు భారీ పెట్టుబడులు
విమానయాన రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమెరికాకు చెందిన సర్గాడ్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో విమానాల నిర్వహణ, మరమ్మత్తులు, పునరుద్ధరణ (ఎంఆర్‌ఓ) కేంద్రాన్ని నెలకొల్పేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దశలవారీగా సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడిని ఈ సంస్థ వెచ్చించనుంది.
ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో భాగంగా దావోస్‌లో జరిగిన సమావేశంలో సర్గాడ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనివాస్ తోట తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలపై విస్తృతంగా చర్చించారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణను మూడు ప్రత్యేక ఆర్థిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సేవల రంగానికి కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), తయారీ రంగానికి పెరి–అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), వ్యవసాయం, గ్రీన్ ఎకానమీకి రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ (రేర్)లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ విధానం ద్వారా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.
వరంగల్ లేదా ఆదిలాబాద్‌లో కేంద్రం?
అలాగే వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండు కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్న సీఎం, ఈ ప్రాంతాల్లో ఏదైనా ఒకచోట ఎంఆర్‌ఓ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సర్గాడ్ సంస్థ సీఈఓకు సూచించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఒకచోట తమ ఎంఆర్వో కేంద్రాన్ని నెలకొల్పాలని ఆయన సంస్థకు సూచించారు. ఈ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అత్యధిక ప్రోత్సాహకాలు అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఈ పెట్టుబడుల వల్ల తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈలకు పరికరాల తయారీ, ఎయిరోస్పేస్ అనుబంధ రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ విప్లవం: రూ. 6,000 కోట్లతో ఎస్‌ఎంఆర్ విద్యుత్ ప్రాజెక్ట్!
క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక ముందడుగు వేసింది. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ లక్ష్యాలతో ముందుకు సాగుతున్న తెలంగాణలో రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్‌ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)ను సమర్పించింది.
దావోస్‌లో వార్షిక సమావేశాల సందర్భంగా, సీఎం ఏ. రేవంత్ రెడ్డితో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ రంగానికి ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, మౌలిక సదుపాయాలపై విస్తృతంగా చర్చ జరిగింది.
నెట్-జీరో లక్ష్యం దిశగా..
తెలంగాణ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 2047 నాటికి నెట్–జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో సుస్థిర అభివృద్ధే తెలంగాణకు ప్రధాన దిశ అని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ హితమైన సాంకేతికతలతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు మేలు చేసే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం తెలిపారు.
స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్‌కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ తెలంగాణలో గరిష్ఠంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొత్తం పెట్టుబడి విలువ 600 మిలియన్ యూరోలు, అంటే సుమారు రూ.6,000 కోట్లుగా అంచనా వేయబడింది.
ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐక్యూ క్యాపిటల్ ఛైర్మన్ డాక్టర్ జాన్ బాబిక్, సీఈఓ అనిల్ కుమార్ బావిసెట్టి, గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈఓ మొలుగు శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుతో తెలంగాణ ఇంధన రంగంలో సరికొత్త అధ్యాయం మొదలవ్వడమే కాకుండా, పారిశ్రామిక రంగానికి నిరంతర క్లీన్ ఎనర్జీ సరఫరా అందుబాటులోకి రానుంది.
బ్లైజ్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ కీలక ఒప్పందం
దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ బ్లైజ్ తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేసింది. డేటా సెంటర్‌లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్‌కు అనుకూలంగా తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్‌వేర్, ఫుల్–స్టాక్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిలో బ్లైజ్ సంస్థకు విశేష అనుభవం ఉంది.
ఈ సమావేశాల సందర్భంగా బ్లైజ్ కో–ఫౌండర్, సీఈఓ దినాకర్ మునగాలా సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణలో టెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ పెట్టుబడులపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చల అనంతరం ఇరు పక్షాల మధ్య అధికారికంగా ఎంవోయూ కుదిరింది.
హైదరాబాద్‌లో ఆర్ అండ్ డీ విస్తరణ
ఈ ఒప్పందంతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇప్పటికే చేపడుతున్న కార్యక్రమాలు మరింత వేగవంతం కానున్నాయి. ఇప్పటికే బ్లైజ్ సంస్థ హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ (ఆర్ అండ్ డీ), ఇంజినీరింగ్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని విస్తరించేందుకు చేపట్టనున్న పెట్టుబడులు, భవిష్యత్ ప్రణాళికలపై కూడా ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. అలాగే హెల్త్‌కేర్ డయాగ్నోస్టిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియెన్సీ వంటి కీలక రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అవకాశాలపై కూడా ఇరు పక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి.
తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దడం రాబోయే రెండు దశాబ్దాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు అత్యంత కీలకమని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్, హార్డ్‌వేర్, ఆటోమేషన్ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దేశంలోనే టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ తన స్థానం మరింత బలోపేతం చేసుకుంటోందని తెలిపారు. బ్లైజ్ సంస్థ హైదరాబాద్ ఆర్ & డీ యూనిట్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇది ఏఐ రంగంలో పెట్టుబడులు, పరిశోధనలు, ఆవిష్కరణలకు వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుందని వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఏఐ గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
